అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, ఓక్‌లాండ్ ఎరీనాలో జరిగిన సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిష్టాత్మకమైన "జీవిత సాఫల్య పురస్కారం" (Lifetime Achievement Award) ప్రదానం చేశారు.
విశిష్ట ప్రజాసేవ, దూరదృష్టితో కూడిన నాయకత్వం, సమాజ ప్రగతి, అభివృద్ధికి అందించిన చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు అందజేశారు.
ఈ సందర్భంగా సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు, ప్రముఖులు, ప్రవాస తెలుగు ప్రతినిధులు శ్రీ పొన్నాల లక్ష్మయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రజా జీవితంలో ఎన్నో దశాబ్దాలుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక సేవకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.
అనంతరం మాట్లాడిన పొన్నాల లక్ష్మయ్య.. ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా, ప్రజా సేవలో తనతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు. భాష, సంస్కృతి, సమాజ సేవను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్న సిలికాన్ ఆంధ్రకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ సత్కారం సభలో పాల్గొన్న వేలాది మంది తెలుగు ప్రేక్షకుల చప్పట్ల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పొన్నాల లక్ష్మయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.















