అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ (Silver Jubilee) వేడుకల్లో ప్రముఖ వేణుగాన విద్వాంసుడు ఫ్లూట్ ఫణికి "Distinguished Artist Award" ప్రదానం చేశారు. ఆగస్టు 1న ఓక్‌లాండ్ అరేనా (Oakland Arena, California) వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ఆయన కళాసేవను, సంగీత రంగానికి అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
సిలికాన్ ఆంధ్ర సంస్థ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రజతోత్సవ వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కళాకారులు, సాహితీవేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్లూట్ ఫణి సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక స్మారక ఫలకాన్ని అందజేశారు.
ఈ గౌరవం లభించడం పట్ల ఫ్లూట్ ఫణి ఆనందం వ్యక్తం చేస్తూ, సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపక ఛైర్మన్ శ్రీ ఆనంద్ కూచిభొట్ల గారికి, నిర్వాహక బృందానికి మరియు తనను ఆదరించిన సంగీతాభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందని, భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు కృషి కొనసాగిస్తానని పేర్కొన్నారు.















