8 ఏళ్ల తెలుగమ్మాయి సరయు తలపనేని అంతర్జాతీయ చెస్‌ వేదికపై సత్తా చాటింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన పాన్‌ అమెరికన్‌ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌-8 బాలికల క్లాసికల్‌ విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది.

ఈ టోర్నీలో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాలకు చెందిన 37 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. మొత్తం 9 రౌండ్లు ఆడిన సరయు.. అన్ని రౌండ్లలోనూ విజయం సాధించి 9/9 పర్ఫెక్ట్‌ స్కోర్‌తో కాంటినెంటల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఏడు దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించి ఈ ఘనత సాధించింది.

ప్రపంచకప్‌కు అర్హత

ఈ విజయంతో ఈ ఏడాది చివర్లో జరిగే యూత్‌ చెస్‌ ప్రపంచకప్‌లో అమెరికాస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం సరయుకు దక్కింది. అలాగే అధికారిక WCM (Woman Candidate Master) FIDE టైటిల్‌కు తాత్కాలిక అర్హత కూడా సాధించింది.

డల్లాస్‌లో ఘన స్వాగతం

కొలంబియా నుంచి డల్లాస్‌కు తిరిగి వచ్చిన సరయుకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులు, ఇర్వింగ్‌, ఫ్రిస్కో నగరాల మేయర్లు ఆమెను అభినందించారు. నాలుగుసార్లు యూఎస్‌ మహిళల జాతీయ చెస్‌ ఛాంపియన్‌ కరిస్సా యిప్‌, చెస్‌ ప్రముఖుడు సాగర్‌ షా నుంచి వచ్చిన అభినందన సందేశాలతో సరయు ఆనందం వ్యక్తం చేసింది.

ఐదేళ్ల వయసులోనే చెస్‌ ప్రయాణం

కేవలం ఐదేళ్ల వయసులో కాపెల్‌ చెస్‌ క్లబ్‌లో గ్రూప్‌ క్లాసులతో సరయు చెస్‌ ప్రయాణం ప్రారంభించింది. ఓ స్థానిక టోర్నమెంట్‌లో ఆమె ప్రతిభను గుర్తించిన అనిల్‌ గుట్ల సూచనతో ప్రత్యేక శిక్షణకు మార్గం ఏర్పడింది. అనంతరం అంతర్జాతీయ మాస్టర్‌ సక్షం రౌటెలా మార్గదర్శకత్వంలో శిక్షణ తీసుకుంది.

ప్రస్తుతం పాఠశాల అనంతరం రోజూ చెస్‌ సాధన చేస్తూ, వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొంటోంది. 2025 డిసెంబర్‌ నాటికి అమెరికాలో 7 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికల టాప్‌-100లో నంబర్‌-1 ర్యాంక్‌ సాధించింది. 2026 జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అండర్‌-8 విభాగంలో FIDE రేటింగ్‌ ప్రకారం ప్రపంచ నంబర్‌-1గా నిలిచింది.

సరయు తండ్రి హైదరాబాద్‌కు చెందినవారు కాగా.. తల్లి కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం కుటుంబం డల్లాస్‌లో నివసిస్తోంది. చదువుతో పాటు చెస్‌లోనూ రాణిస్తూ ముందుకు సాగుతున్న సరయు.. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.