భారత స్టార్ షట్లర్ P. V. సింధు సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫోటో ఇప్పుడు క్రీడా ప్రపంచంతో పాటు ఫిట్‌నెస్ ప్రేమికుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. వరుసగా రెండు గంటల వ్యవధిలో రెండు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఆడి విజయాలు సాధించిన అనంతరం.. మోకాళ్లు, భుజాలకు ఐస్ ప్యాక్‌లు కట్టుకుని అలసటతో కుర్చీలో కూర్చున్న ఫోటోను సింధు తన అభిమానులతో పంచుకున్నారు.
“నా శరీరం ఇప్పుడు నాకు మర్యాదగా గుర్తు చేస్తోంది.. నాకిప్పుడు 19 ఏళ్లు కావని” అంటూ ఆమె రాసిన క్యాప్షన్ ఎంతో మందిని ఆలోచింపజేసింది. క్రీడాకారుల జీవితంలో వయసు పెరిగేకొద్దీ శరీరంలో జరిగే సహజ మార్పులు, రికవరీకి పట్టే సమయం ఎంత కీలకమో ఈ ఒక్క ఫోటో స్పష్టం చేసింది.
ప్రస్తుతం ముప్పై ఏళ్లు దాటిన అథ్లెట్లు మాత్రమే కాదు.. సాధారణంగా ఫిట్‌నెస్ కోసం జిమ్‌లు, స్పోర్ట్స్ లేదా తీవ్రమైన వ్యాయామాలు చేసే వారిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. యువకులతో సమానంగా శరీరాన్ని ఒత్తిడికి గురి చేస్తే కండరాల బలం, కీళ్ల కదలికలు, స్టామినా పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేకంగా సరైన వార్మప్, స్ట్రెచింగ్, తగిన విశ్రాంతి మరియు రికవరీ సమయాన్ని పట్టించుకోకుండా కేవలం అధిక తీవ్రతతో వ్యాయామం చేయడం ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని వ్యాయామ పద్ధతులను మార్చుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేస్తున్నారు.

















