ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోరంగా విఫలమైంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేసింది. పథమ్ నిస్సాంక 50 పరుగులతో పోరాడగా.. అశుతోష్ శర్మ 39 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. కలకత్తా బౌలర్లలో అనుకూల్ రాయ్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు తీశారు.
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కలకత్తా జట్టుకు ఫిన్ అలెన్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో విజయం అందించాడు. కేవలం 47 బంతుల్లోనే అజేయ శతకం సాధించి ఢిల్లీ బౌలర్లను చిత్తు చేశాడు. ఐదు ఫోర్లు, పది భారీ సిక్సర్లతో అలెన్ స్టేడియాన్ని ఊపేశాడు. కామెరూన్ గ్రీన్ 33 పరుగులతో సహకరించగా.. కలకత్తా 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసిపోయాయి. ఇక కలకత్తా మాత్రం మిగతా మ్యాచ్‌ల్లో గెలిస్తే అవకాశాలు సజీవంగా ఉంచుకునే స్థితిలో ఉంది.
















