న్యూజెర్సీలోని కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన CPR & AED శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కుటుంబాలు, యువత, విద్యార్థులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే కీలక నైపుణ్యాలను అభ్యసించారు.
ఈ శిక్షణను కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ చీఫ్ అల్ లో-బీర్ నిర్వహించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ఎలా ఉండాలి, సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) విధానాలు, AED (Automated External Defibrillator) పరికరం వినియోగం వంటి అంశాలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు. ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్రాక్టికల్ సెషన్ల ద్వారా పాల్గొన్నవారిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే నమ్మకం పెంపొందించారు.
ఈ సందర్భంగా చీఫ్ అల్ లో-బీర్, రెండు సంవత్సరాల క్రితం తానా అందించిన LUCAS Chest Compression System సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పరికరం గుండెపోటు బాధితులకు ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా నిరంతరాయంగా నాణ్యమైన ఛెస్ట్ కంప్రెషన్స్ అందిస్తూ అనేక ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి అత్యాధునిక పరికరాన్ని అందించిన తానాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గుండె స్పందన ఆగిపోయిన రోగులకు అలసట లేకుండా ఆటోమేటిక్‌గా ఛెస్ట్ కంప్రెషన్స్ అందించే LUCAS వ్యవస్థ ప్రాణరక్షణలో అత్యంత కీలకమైన సాంకేతిక పరికరంగా గుర్తింపు పొందింది. మెదడు సహా శరీరంలోని ముఖ్య అవయవాలకు రక్తప్రసరణ కొనసాగించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ రీజినల్ ప్రతినిధి సుధీర్ చంద్ర నారేపలుపు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేకా, తానా కేర్స్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కల్వకోలు, టీమ్ స్క్వేర్ కోఆర్డినేటర్ రవి మాచర్ల, వాలంటీర్లు హరీష్ కోయ, దశరథ్ తాళ్లపనేని తదితరులు విశేషంగా కృషి చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్థానిక హైస్కూల్ విద్యార్థిని, EMS వాలంటీర్ వర్షా నారేపలుపును తానా నాయకత్వం అభినందించింది. చిన్న వయస్సులోనే సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడింది.
ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ, "తానా కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు. సమాజానికి సేవ చేయడం, అవగాహన కల్పించడం, ప్రజలను శక్తివంతం చేయడం మా ప్రధాన లక్ష్యం. CPR, AED వంటి శిక్షణలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల సామర్థ్యాన్ని ప్రజలకు అందిస్తాయి" అని అన్నారు.
అలాగే, "రెండు సంవత్సరాల క్రితం LUCAS పరికరాన్ని అందించినప్పుడు మా లక్ష్యం ప్రాణాలను కాపాడడమే. నేడు అది అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా మారడం ఆనందంగా ఉంది. ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధి, రైతు సంక్షేమం, మానవతా సేవలు వంటి అనేక రంగాల్లో తానా తన సేవలను కొనసాగిస్తుంది" అని పేర్కొన్నారు.
కార్యక్రమ విజయానికి తోడ్పడిన కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్, చీఫ్ అల్ లో-బీర్, వాలంటీర్లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ప్రజారోగ్య అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం, యువతలో సేవా స్పూర్తి, సమాజ సాధికారత పెంపొందించడంలో తానా చేస్తున్న కృషికి ఈ CPR & AED శిక్షణ కార్యక్రమం మరో నిదర్శనంగా నిలిచింది.



















