తెలుగు సినీ సాహిత్యానికి చెరగని ముద్ర వేసిన కవికులాలంకార వేటూరి సుందరరామమూర్తి సాహిత్య వైభవాన్ని స్మరించుకుంటూ అమెరికాలోని ఫ్రిస్కోలో ప్రత్యేక సాహితీ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేటూరి సాహితీ మహోత్సవం పేరుతో ఈ కార్యక్రమాన్ని వేటూరి సాహిత్యాభిమానులు, శుభం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఆగస్టు 16, 2026 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఫ్రిస్కోలోని Memorial High School Auditorium, 12300 Frisco Street, Frisco, TX 75033 వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
వేటూరి గారి అద్భుతమైన సినీ, సినీయేతర సాహిత్యాన్ని గుర్తుచేసేలా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. వేటూరి ప్రత్యేక పాటల నృత్య ప్రదర్శనలు, సంగీత విభావరితో పాటు ఆయన రచనల ఆధారంగా ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వేటూరి సినీ, సినీయేతర గీతాలకు సంబంధించిన 8 గీత సంపుటాలను ఆవిష్కరించనున్నారు.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమానికి తెలుగువేదకవి, ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఈనాడు దినపత్రిక సంపాదకులు శ్రీ ఎం. నాగేశ్వరరావు విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. అలాగే సింగపూర్ తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు, పద్యకవి, సామాజిక కార్యకర్త శ్రీ వామరాజా సత్యమూర్తి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
కార్యక్రమానికి డా. ప్రసాద్ తోటకూర సభాధ్యక్షత వహించనున్నారు.
నృత్యం, సంగీతంతో ప్రత్యేక ఆకర్షణ
వేటూరి సాహితీ వైభవాన్ని నృత్యం, సంగీతం ద్వారా ఆవిష్కరించేందుకు పలువురు కళాకారులు, నృత్య గురువులు పాల్గొననున్నారు. గురు శ్రీమతి శీలత సూరి, గురు శ్రీమతి రాగ సింధూర పుట్టమనేని, గురు శ్రీమతి శ్రీవాణి యద్దనపూడి, గురు శ్రీమతి మందా హేమమాలిని చావలి తదితరులు నృత్య ప్రదర్శనలకు సహకరించనున్నారు.
అలాగే సాహిత్య, సంగీత కార్యక్రమాల్లో శ్రీ సంతోష్ భుజంకర్, శ్రీ చంద్రశేఖర్ ముద్దుకూరి, కుమారి సాహితి కొల్లూరాజు, శ్రీ శ్రేయస్ నూర..., శ్రీమతి రేవతి కొల్లూరాజు, శ్రీమతి జానకి శంకర్ తదితరులు భాగస్వాములు కానున్నారు.
సంగీత విభావరిలో సమన్వయకర్త, కీబోర్డ్ కళాకారులు, కీబోర్డ్ & గిటార్, పెర్కషన్ వాయిద్య కళాకారులు, సౌండ్ ఇంజనీర్, సాంకేతిక బృందం ప్రత్యేకంగా పనిచేయనున్నారు. వేటూరి పాటలను సంగీత రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఉచిత ప్రవేశం.. ఎంట్రీ పాస్ తప్పనిసరి
ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. అయితే ఆడిటోరియంలో ప్రవేశించేందుకు ఎంట్రీ పాస్ తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు.
డల్లాస్–ఫ్రిస్కో ప్రాంతంలోని తెలుగు సాహిత్య, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేటూరి సాహితీ వైభవాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
వేటూరి పాటలు, పద్యాలు, సాహిత్యాన్ని ప్రేమించే వారికి ఈ సాహితీ మహోత్సవం ప్రత్యేక అనుభూతిని అందించనుంది.











