అమెరికాలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత విస్తరించే దిశగా అడుగులు పడుతున్నాయి. మిషిగన్‌లో IOC చాప్టర్ ఎగ్జిక్యూటివ్ సమావేశం కీలకంగా జరిగింది. శుక్రవారం రాత్రి IOC మిషిగన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ పటేల్ తన నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
చాప్టర్ ప్రారంభమైన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులతో శ్రీధర్ పటేల్ చర్చించారు. IOC గ్లోబల్ చైర్మన్ సామ్ పిట్రోడాతో జరిగిన సమావేశం వివరాలను కూడా సభ్యులతో పంచుకున్నారు.
ఈ సమావేశానికి భారత స్టార్ ఫ్రీస్టైల్ రెజ్లర్లు బజరంగ్ పునియా, సంగీతా ఫోగట్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడిన వారు.. టీమ్ బిల్డింగ్, సమిష్టి కృషి, నాయకత్వంపై ప్రోత్సాహకరమైన సూచనలు చేశారు. ప్రతి సభ్యుడితో మమేకమై వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఇక సమావేశంలో సభ్యుల పరిచయ కార్యక్రమం కూడా జరిగింది. వివిధ రంగాల్లో తమకున్న అనుభవాలు, భారత్‌లోని కాంగ్రెస్ పార్టీతో తమ అనుబంధాలు, అభిప్రాయాలను సభ్యులు పంచుకున్నారు.
అనంతరం IOC నేషనల్ ప్రెసిడెంట్ మొహిందర్ సింగ్ గిల్జియన్తో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మిషిగన్ సభ్యులను ఆయనకు శ్రీధర్ పటేల్ పరిచయం చేశారు. దేశవ్యాప్తంగా IOC సభ్యత్వాన్ని పెంచడం, మరింత మందిని సంస్థతో అనుసంధానం చేయడం, సమిష్టిగా ముందుకు సాగడం లక్ష్యంగా పనిచేయాలని మొహిందర్ సింగ్ సూచించారు.
మొత్తానికి.. మిషిగన్‌లో IOC బలోపేతానికి కీలక అడుగులు పడుతున్నాయి. సభ్యులంతా ఒకే టీమ్‌గా పనిచేస్తూ సంస్థను మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.















