అమెరికా పర్యటనలో భాగంగా షార్లెట్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. IOC, TPCC NRI సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షార్లెట్‌లో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు, తెలంగాణ వాసులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ విజన్‌పై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. సుస్థిర నగరాభివృద్ధి, భూపరిపాలన, ఆర్థిక పురోగతి, పెట్టుబడులు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థల ఏర్పాటుపై దయాకర్ వివరించారు.
భూమి హక్కుల పరిరక్షణ, పారదర్శక రెవెన్యూ వ్యవస్థ, పటిష్టమైన శాంతిభద్రతలతో పెట్టుబడిదారులకు, ప్రజలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడంలో ఎన్‌ఆర్‌ఐల అనుభవం, భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఎన్‌ఆర్‌ఐలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

















