భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నేషనల్ అలయన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ (NAIO) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ మారియట్‌లో ‘ఆజాదీ కా మహోత్సవ్’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత్–అమెరికా స్నేహబంధం, భారతీయ సంస్కృతి, ప్రవాస భారతీయుల సేవలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ వేడుకలకు భారత కాన్సుల్ జనరల్ బినయా ప్రధాన్, బాలీవుడ్ నటి, మోడల్ కశిష్ రాజ్‌పుత్, బాలీవుడ్ నటి సమైరా సంధు, ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, సింగర్, ర్యాపర్, మోటివేషనల్ స్పీకర్ స్పర్శ్ షా తదితర ప్రముఖులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, కళలు, సంగీతం, సమాజ సేవ తదితర రంగాల్లో ప్రవాస భారతీయుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతీయ అమెరికన్ కమ్యూనిటీ చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ సందర్భంగా భారతీయ మూలాలు, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కమ్యూనిటీ సంస్థల పాత్రపై చర్చ జరిగింది. భారతీయ అమెరికన్లు అమెరికా సమాజంలోని వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను కూడా గుర్తుచేశారు.
భారత్–అమెరికా సంబంధాలు, భారతీయ సంస్కృతి, ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.















