జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. నవి ముంబై నుంచి శ్రీనగర్‌కు వచ్చిన ఇండిగో ఫ్లైట్ 6E 225.. ల్యాండింగ్ అనంతరం పార్కింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎయిర్‌పోర్టు అధికారుల ప్రకారం.. ఉదయం సుమారు 9:02 గంటల సమయంలో బే నంబర్ 06 వద్ద విమానాన్ని పార్క్ చేస్తుండగా.. దాని ముందు భాగం విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) పోల్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ.. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ప్రయాణికులను మాన్యువల్ నిచ్చెనల ద్వారా విమానం నుంచి సురక్షితంగా కిందికి దించారు.
ఈ ఘటనతో శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని.. నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని విమానయాన వర్గాలు వెల్లడించాయి.









