
శ్రీనగర్: అత్యాచార బాధితురాలు బాలిక మృతి కేసులో నర్సును కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలికపై పంతులు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో గర్భం దాల్చింది. ఈ సంఘటన జమ్ము కశ్మీర్ రాష్ట్రం కిష్ట్వార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గత కొన్ని నెలల నుంచి గిరిజన మైనర్ బాలికపై టీచర్ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి కావడంతో గర్భం తొలగించాలని టీచర్ నిర్ణయం తీసుకున్నాడు. తన సోదరుడితో కలిసి బాలికను చత్రూలోను పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి కిష్ట్వార్ లోని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. బాలిక గర్భం తొలగించేందుకు అక్కడ పని చేసే స్వీపర్ సాయంతో పాటు నర్సు సోనిక సాయం తీసుకున్నాడు. గర్భం తొలగించే క్రమంలో బాలిక చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీచర్‌తో పాటు అతడి సోదరుడు, స్వీపర్, నర్సును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఎవరున్నా వదిలిపెట్టే సమస్యలేదని పోలీసులు ఘాటుగా హెచ్చరించారు.











