కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ సర్కిల్ లో బిఆర్ఎస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో డీజిల్ లేక చెత్త వాహనాలు ఆగిపోవడంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించకపోవడంతో ఆ చెత్తను తెచ్చి సర్కిల్ కార్యాలయంలో గులాబీ నేతలు పడేశారు.  నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగ రాయ ప్రసాద్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు తామే స్వయంగా చెత్తను సంచులో నింపుకొని తీసుకువచ్చి డిప్యూటీ సర్కిల్ కార్యాలయం ముందు వేసి బిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. జిహెచ్ఎంసిలో సిఎంసిలో తమ ప్రాంతాన్ని కలిపినా ప్రజల కష్టాలు తీరటంలేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఫోన్లు ఎత్తటం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు ఇలా ఉందని దుయ్యబట్టారు. గతంలో కెటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సమస్య ట్విట్టర్ లో పెడితే 15 నిమిషాల్లో సమస్య పరిష్కారం అయ్యేదని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ శాఖను చూస్తున్న ఎక్కడ వేసిన గోంగడి అక్కడే ఉందని మండిపడ్డారు.

నిజాంపేట్ లో మున్సిపల్ శాఖ అధికారులు బలహీన వర్గాల మీద పడి తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెత్త తీయడం చేతగాని మున్సిపల్ శాఖకు బిల్డింగులు మాత్రం కూల్చే పని మాత్రమే పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలు కూలుస్తూ డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు ఖబర్దార్ అంటూ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో రేపటినుండి చెత్త తీయకపోతే తామే ట్రాక్టర్లలో చెత్త తీసుకొచ్చి కార్యాలయంలో వేస్తామని రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బి ఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని అందుకు నిదర్శనమే నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం అని అన్నారు. చెత్త వాహనాలకు డీజిల్ పోసేందుకు డబ్బులు లేక చెత్త సేకరణ నిలిచిపోయిందని రేపటి నుంచి భారీ నిరసనలు ఉంటాయని బిఆర్ఎస్ శ్రేణులు వివరించాయి.