
న్యూఢిల్లీ: బిసిసిఐ, పాకిస్థాన్ క్రికెటర్లకు ఐపిఎల్ లో ఆడేందుకు అనుమతించని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ మాజీ పేసర్.. ఐపిఎల్ ఆడే అవకాశం లభించింది. పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్.. బ్రిటిష్ పౌరసత్వం పొందాడు. దీంతో ఇప్పుడు ఐపీఎల్ వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ లెఫ్ట్-ఆర్మ్ పేసర్ రెండోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. బ్రిటిష్ పౌరురాలైన తన భార్య నర్జిస్ ఖాన్ ద్వారా యూకే పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు అతను గతంలో వెల్లడించాడు. ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తయినట్లు సమాచారం.
అమీర్ తన కొత్త జాతీయతను సూచిస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసిన తర్వాత, అతని ఐపీఎల్ అర్హతపై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఎందుకంటే పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాల కింద నమోదు చేసుకున్న విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ ప్లేయర్ పూల్‌కు అర్హులుగా ఉంటారు.
ఇక, అమీర్ కూడా ఈ అవకాశం గురించి గతంలో మాట్లాడుతూ.. బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందడం ద్వారా 2026లో ప్రారంభమయ్యే లీగ్‌కు తాను అర్హుడనవుతానని పేర్కొన్నాడు. "వచ్చే ఏడాది నాటికి, నాకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఉంటుంది. అవకాశం ఇస్తే ఎందుకు వదులుకోవాలి? నేను ఐపీఎల్‌లో ఆడతాను" అని అమీర్ అన్నాడు. ఇప్పుడు బ్రిటిష్ పౌరసత్వం రావడంతో.. వచ్చే ఏడాది(2027) ఐపిఎల్ వేలంలో అమీర్ పాల్గొనే అవకాశం ఉంది.
కాగా, 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడలేదు. షాహిద్ అఫ్రిది డెక్కన్ ఛార్జర్స్‌కు, షోయబ్ అక్తర్, ఉమర్ గుల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు, సోహైల్ తన్వీర్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. అయితే, ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్ ఆధారిత ఆటగాళ్లపై నిషేదం విధించింది.
అయితే, పాక్ మాజీ ఆల్-రౌండర్ అజహర్ మహమూద్.. బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాత, మహమూద్ పాకిస్థాన్ క్రికెటర్‌గా కాకుండా ఇంగ్లీష్ ఆటగాడిగా ఐపీఎల్‌లోకి ప్రవేశించాడు. అతను 2012, 2013లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత 2015లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు.












