వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగర పరిధిలో 400కు పైగా శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించింది. వీటిలో 377 భవనాలు నిర్మాణపరంగా ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, అత్తాపూర్, జంగంమెట్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఈ భవనాలు ఉన్నట్లు గుర్తించారు.
గన్‌ఫౌండ్రీలోని అలియా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం కూడా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని, ముషీరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్ రిటైనింగ్ వాల్ కూలిపోయిందని తెలిపారు.
అక్రమ సెల్లార్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు. ప్రమాదకర భవనాలపై సమాచారం అందించేందుకు HYDRAA 9000113667 హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది.













