మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న భారీ ముఠాను హైదరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఛేదించారు. క్యూనెట్‌కు అనుబంధంగా ఇగ్నైట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా రూ.5 వేల కోట్ల మోసానికి ప్రణాళిక వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో కీలక నిందితులైన ఆరుగురిని కేరళ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అరెస్ట్ చేశారు.

బాధితులకు భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.87 లక్షల వరకు వసూలు చేసిన నిందితులు, మరింత మంది సభ్యులను చేర్చితేనే డబ్బు తిరిగి వస్తుందని చెప్పడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్ నగర్, కాచిగూడ, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా కేసును ఈవోడబ్ల్యూ దర్యాప్తు చేసింది.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా ఆర్మీ సిబ్బందిని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తేలింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు పత్మన్ సేనాథిరాజా, విజయ్ ఈశ్వరన్‌లపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.