ఖమ్మం నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం సోనోవిజన్‌లో భారీ చోరీ జరిగింది. వైరా ప్రధాన రహదారిలో ఉన్న ఈ షోరూంలో గురువారం తెల్లవారుజామున ముగ్గురు గుర్తుతెలియని దుండగులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు.
ఉదయం 3:30 గంటల సమయంలో ఏపీ నెంబర్ గల కారులో వచ్చిన దొంగలు చోరీకి పాల్పడగా, అలారం మోగడంతో విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే సిబ్బంది చేరుకునేలోపే దుండగులు దాదాపు రూ.కోటి విలువైన సెల్‌ఫోన్‌లు, 25 ఐఫోన్‌లు, ఛార్జర్లు, అడాప్టర్లు అపహరించి పరారయ్యారు.
దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన షోరూం సిబ్బంది వారి కారును బుల్లెట్ వాహనంతో వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఘటనాస్థలాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, వేలిముద్రల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













