కేరళ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న మార్షల్ దీవుల జెండాతో నమోదైన ఓ ముడి చమురు ట్యాంకర్‌లో చిక్కుకున్న పేలని క్షిపణి వార్‌హెడ్‌ను భారత నౌకాదళం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ ద్వారా సురక్షితంగా వెలికితీసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఎంటీ ఒలింపిక్ లైఫ్ అనే ఈ చమురు ట్యాంకర్‌లో భారతీయులు ఎవరూ లేరు. ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా నుంచి కొచ్చికి ప్రయాణిస్తోంది. మే 26న ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో నౌక బయటి భాగంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందిందని రక్షణ శాఖ తెలిపింది. అయితే అనంతరం కొచ్చి వైపు ప్రయాణం కొనసాగిస్తుండగా,

నౌకలో పేలని ఆయుధ పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం ఇండియన్ ఓషన్ రీజియన్ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ద్వారా భారత నౌకాదళానికి చేరడంతో వెంటనే చర్యలు ప్రారంభించారు. కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్‌కు చెందిన ప్రత్యేక ఎక్స్‌ప్లోసివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. పరిశీలనలో ఒక క్షిపణి నౌక బాహ్య కవచాన్ని ఛేదించి, అనేక అంతర్గత విభాగాల గుండా ప్రయాణించి, చివరకు ఇంధన ట్యాంక్‌లో చిక్కుకుపోయినట్లు గుర్తించారు.


ఇంధన నిల్వ ట్యాంక్‌లో పేలని క్షిపణి వార్‌హెడ్ ఉండటం అత్యంత ప్రమాదకర పరిస్థితి కావడంతో, నౌక, సిబ్బంది, అలాగే కొచ్చి పోర్టు మౌలిక సదుపాయాలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా దశలవారీగా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అవసరమైన భద్రతా చర్యలు పూర్తిచేసిన అనంతరం, ఆధునిక సాంకేతిక పద్ధతుల సహాయంతో వార్‌హెడ్‌లోని పేలుడు వ్యవస్థను గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేశారు. అనంతరం క్షిపణి వార్‌హెడ్‌తో పాటు సంబంధిత శకలాలను కూడా సురక్షితంగా బయటకు తీశారు. వెలికితీసిన పేలుడు పదార్థాన్ని ప్రస్తుతం భద్రత కలిగిన ప్రత్యేక కేంద్రానికి తరలించినట్లు భారత నౌకాదళం తెలిపింది. అక్కడ దాన్ని సురక్షితంగా నిల్వ ఉంచడంతో పాటు, దాని మూలం, ఇతర వివరాలపై సమగ్ర పరిశీలన చేపట్టనున్నట్లు వెల్లడించింది.