
అమరావతి: ఎపిలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం వైసిపిపై బురదచల్లేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి గూడెం లో జగన్ మీడియాతో మాట్లాడుతూ.. మావిగన్ పేరు విన్నా, పాత కాంట్రాక్టర్లకు టెండర్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బిపి పెరుగుతుందని విమర్శించారు. 2018లో ఐదు టవర్ల కోసం రూ. 2,271 కోట్లకు టెండర్లు ఖరారు చేశారని, అవే బిల్డింగుల నిర్మాణానికి టెండర్లు రద్దు చేసి మళ్లీ పాత కాంట్రాక్టర్లకే ఇచ్చారని జగన్ మండిపడ్డారు. రూ. 1200 కోట్లతో అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించారని, అవి కూడా కలిపితే చదరపు అడుగు నిర్మాణానికి రూ. 30 వేలకు పైనే ఖర్చవుతుందని, ఇప్పుడు మళ్లీ కొత్త బిల్డింగ్ లు కడతానని అంటున్నారని మండిపడ్డారు. పర్మినెంట్ సెక్రటేరియట్ అంటూ కొత్త నిర్మాణాలు చేపట్టి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అప్పటి లెక్కప్రకారం ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి రూ. 4,350 పడుతుందని, బిల్డింగ్ అద్దాల కోసం రూ. 2,540 కోట్లు ఖర్చు చేస్తున్నారని, బిల్టింగ్ డిజైనింగ్ కు రూ. 401 కోట్లు, మొత్తంగా 5 బిల్డింగ్ లకు అయ్యే ఖర్చు రూ.10,664 కోట్లు అవుతుందని, ఇప్పుడు చదరపు అడుగు నిర్మాణానికి రూ. 20,427 కోట్లు ఖర్చు అవుతుందని జగన్ పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే.. తమపైనే బురదచల్లుతున్నారని, జాతరలో గొడవవల్లే హత్య జరిగిందని, పెద్ద దస్తగిరి భార్య చెప్పిందని అన్నారు. కల్పిత కథతో కేసు పెట్టి వైసిపి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారని, ఎవరిది గొడ్డలి పార్టీ ఎవరిది గన్ కల్చర్? అని ఎవరివి హత్యా రాజకీయాలు అని ప్రశ్నించారు. తమ తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారని, చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలోనే తమ తాత రాజారెడ్డిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణంపై ఇప్పటికీ నివృత్తి కాని అనుమానాలు ఎన్నో ఉన్నాయని, వైఎస్ వివేకాను చంపానంటూ దస్తగిరే లైవ్ షోలో చెప్పాడని అన్నారు. తన నాన్న రాజశేఖర్ రెడ్డిని పులివెందులకు పరిమితం చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. అధికార దుర్వినియోగం చేసి రాజారెడ్డిని హత్య చేసిన వారిని రక్షించారని, బాబ్జీ మృతిపై విచారణ లేదని, ఎవరివి శవ రాజకీయాలు? అని ప్రశ్నించారు. సినీ నటుడు బాలకృష్ట గన్ పట్టుకుని ఇద్దరిని టపా.. టపా కాల్చలేదా? అని ప్రశ్నించారు. హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే.. పరామర్శకు వెళ్లి కెటిఆర్ తో చంద్రబాబు పొత్తులపై మాట్లాడారని, సొంతమామకు వెన్నుపోటు పొడిచి సిఎం కుర్చీని, పార్టీని చంద్రబాబు లాక్కున్నారని అన్నారు. తమ నాన్న తనకు హత్యారాజకీయాలు నేర్పలేదని మంచి రాజకీయాలు చేయాలనే చెప్పారని, 77ఏళ్ల చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నికలు ఏమో అని ఎద్వేవా చేశారు. తాను మంచోడిని కాబట్టే తమ తాతను చంపినవాళ్లు ఇంకా బయట తిరుగుతున్నారని జగన్ పేర్కొన్నారు.












