కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి, సరదాగా నదికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన వారు ప్రమాదానికి గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన యువన్ చంద్ర (5), సతీష్ (35), మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర (25), ధను (23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) నదిలో గల్లంతైన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రాలయంలోని ఓ బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం కోసం వీరంతా హాజరయ్యారు.

పూజ ముగిసిన తర్వాత అందరూ కలిసి సమీపంలోని తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అక్కడ నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్ల నదిలో ఈతకు దిగిన ఐదుగురు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కాగా, ఈ ప్రమాదం నుండి ఆదోనికి చెందిన అపర్ణ అనే మహిళ సురక్షితంగా బయటపడింది.సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక మత్స్యకారులు, గజఈతగాళ్ల సహాయంతో నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైంది. మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.