
1941 జూలై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ సినిమా ’16 వయధినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక హరిప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోని అడుగుపెట్టారు. ఈ సినిమాతో సుహాసినిని టాలీవుడ్‌కు పరిచయం చేశారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.
కుంగదీసిన కుమారుడి మరణం..
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు భారతీ రాజా. అయితే ఆయన కుమారుడు మనోజ్ గత ఏడాది హఠాన్మరణం చెందడం భారతీ రాజాను మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఆ పుత్రశోకం నుంచి ఆయన కోలుకోలేకపోయారు. ఇక ఆ ఆవేదనతోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి చివరికి కన్నుమూశారు. భారతీ రాజా కేవలం దర్శకుడు మాత్రమే కాదు, సినిమా రూపురేఖలను మార్చిన విప్లవకారుడు. ఇక అప్పటివరకు స్టూడియోలకే పరిమితమైన సినిమాలను పల్లెటూరి పచ్చదనం వైపు, సహజత్వం వైపు నడిపించిన ఘనత ఆయనదే. ఆయన తన సినీ ప్రయాణంలో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్‌తో భారతీరాజా ఏకంగా 5 అద్భుతమైన చిత్రాలు తీసి ఇండస్ట్రీ హిట్లను అందుకున్నారు. తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి హిట్ అయ్యాయి.
టాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం
భారతీరాజా ఎక్కువగా తమిళ సినిమాలు తీసినప్పటికీ, తెలుగు ప్రేక్షకులతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగులో ఆయన నేరుగా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక, కొత్త జీవితాలు, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ’సీతాకోక చిలుక’ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. 80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఓ ఊపు ఊపేసిన ఈ సినిమాలో కార్తిక్, అరుణ, శరత్‌బాబు, సిల్క్‌స్మిత కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు. ఇక ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు భారతీరాజా. రాధిక, రాధ, ముచ్చర్ల అరుణ వంటి స్టార్ నటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు. మన తెలుగు సీనియర్ దర్శకుడు వంశీ భారతీ రాజా శిష్యుడే కావడం విశేషం.
నటుడిగానూ మెప్పించి..
దర్శకత్వానికి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారతీ రాజా నటుడిగానూ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సుమారు 20 సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగానూ మెప్పించారు. చివరగా మోహన్ లాల్ నటించిన ‘తుడరుమ్’ అనే చిత్రంలో ఆయన నటించారు.
అత్యున్నత పురస్కారాలు అందుకొని..
సినిమా రంగానికి భారతీరాజా చేసిన సేవలకు గాను 2004లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన ప్రతిభకు గుర్తింపుగా 6 జాతీయ అవార్డులతో పాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి. ‘సీతాకోక చిలుక’కు జాతీయ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.












