
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ సుస్థిరత అవసరాన్ని ప్రజానీకం గుర్తించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. స్థిరత్వంతో సుస్థిర ప్రభుత్వం తద్వారా సముచిత నిర్ణయాధికారం సంక్రమిస్తుందని, ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించారని వివరించారు. దేశంలో అత్యంత సుదీర్ఘ నిరంతర పాలనతో కూడిన ప్రభుత్వ రికార్డు నేపధ్యంలో మోడీ బుధవారం ఎన్‌డిఎ సదస్సులో ప్రసంగించారు. తనకు ప్రజలే దేవుళ్లని, ఎన్నుకున్న ప్రజల మన్ననలే తనకు మిన్న అని భారత్ మండపంలో జరిగిన విజయాభినందన సభలో తెలిపారు. తమ ప్రభుత్వం నిర్ణీత లక్షాలతో ముందుకు సాగేందుకు కలిసి వచ్చిన ఎన్‌డిలోని మిత్ర పక్షాలకు ధన్యవాదాలు అని చెప్పారు.వారి భాగస్వామ్యంతో సాగుతున్నామని, ఇదే క్రమంలో వారి సహకారంతో లక్షాలు నెరవేర్చగల్గుతున్నామని స్పందించారు. ఏ దేశ చరిత్ర చూసినా సుస్థిరత లేకుంటే దేశ ప్రగతి అసాధ్యం అవుతుంది. అరాచకం జన కంటకం అవుతుంది. ఈ విషయాన్ని విజ్ఝులైన జనం గుర్తించారని తెలిపారు. వికసిత భారత్ ఓ చిరకాల స్వప్నం.
ఇది కేవలం ఓ వ్యక్తికి లేదా ఓ పార్టీకి చెందినది కాదని, దేశంలో ప్రతి పౌరుడి సంకల్పం అయిందని తెలిపారు. ప్రజల కోసం ప్రజలతో సాగడమే ప్రజలు దీవించిన తమ ప్రభుత్వ ఆలోచనా విధానం అని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సవాళ్ల నడుమ జాతీయ స్థాయిలో స్థిరత అవసరం అని ప్రజలు తెలుసుకున్నారు. దీనితోనే తనకు ఇంతకాలం పాలన అందించే సదవకాశం కల్పించారని తెలిపారు. ఇది ఈ దేశ ప్రజల విజ్ఞత అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గత కాంగ్రెస్ హయాంలో పాలన తీరుతెన్నులపై విరుచుకుపడ్డారు. 2014కు ముందు దేశంలో అస్థిరత్వం, ఆటుపోట్లు ఉంటూ వచ్చాయి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని విశ్లేషించారు. దశాబ్దాల తరబడి ఇదే దుస్థితి ఉంటూ వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ చాలాకాలంగా సాగించిన పాలనతో నెలకొన్న విష వలయాన్ని క్రమేపీ ఎన్‌డిఎ ఈ 12 ఏండ్లలో పూర్తిగా ఛేదించివేసిందని, ఇదే ఎన్‌డిఎ విజయం అని తెలిపారు.
కాంగ్రెస్ ద్రోహంతో దెబ్బతిన్న ప్రజలు ఎన్‌డిఎపై ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు,నమ్మకాన్ని తాము వయ్ము చేయకుండా ముందుకు వెళ్లుతున్నామని అన్నారు. ఎన్‌డిఎ పరివార్ ప్రజలు పెంచుకున్న ఆశలు తెంచివేయకుండా సాగిందని తెలిపారు. సగటు సామాన్య వ్యక్తికి మేలు జరిగిందనే నమ్మకం తనకు ఉందన్నారు. గతంలో ఆర్టికల్ 370 అంటే అదేదో బ్రహ్మస్త్రంగా భ్రమింపచేశారు. టచ్ చేస్తే ఏదో అవుతుందనే సాకుతో జనం బాధలు పడేలా చేశారు. అయితే తమ ప్రభుత్వం దీనిని రద్దు చేసింది. ఇప్పుడు అక్కడ తలెత్తిన మార్పులను చవిచూస్తున్నామని గుర్తు చేశారు. అదే విధంగా దేశంలో ఉగ్రవాద దాడులతో తల్లడిల్లారు. ఇప్పుడు మనం ఉగ్రవాదుల ఏరివేతకు ముందుకు దూకుతున్నామన్నారు. ఇక దేశంలోని మారుమూల ప్రాంతాలకు ప్రగతి ఫలాలు దరిచేరనివ్వని నక్సలిజం జోలికి వెళ్లకుండా గడిపారు. అయితే తమ హయాంలో నిర్ణీత గడువు ఖరారు చేసుకుని ఈ తీవ్ర సమస్యను నిర్మూలించగలిగామని తెలిపారు. నెలకొన్న సుస్థిరతతో వికసిత భారత్ లక్ష సాధనకు ముందుకు వెళ్లుతున్నామని , ఇందుకు అందరి సహకారం ఆనందదాయకం అన్నారు. భారత్‌లో మార్పుల వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
అనేక దేశాలు తమ సమస్యల పరిష్కారానికి భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కీలక రంగాలలో పరిణామాలు ఇప్పుడు పరిస్థితులను గుర్తించాలని కోరారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు పలు రంగాలలో జరిగాయి. అభివృద్ధి కుంటుపడింది. సుపరిపాలన క్రమంలో ఇప్పుడు దేశం ముందుకు సాగుతోంది. విద్యుత్ రహదారులు , రైల్వే, విమానయానంపై దృష్టిపెట్టామని వివరించారు. గతంలో దేశవ్యాప్తంగా పాతిక కోట్లకు పరిమితం అయిన ఇంటర్నెట్ వాడకం, కేవలం సంపన్నులకు పరిమితం అయిన సాధనాసంపత్తిని విస్తరించాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా వందకోట్లకు దాటి ఇంటర్నెట్ సేవలు విస్తరించుకుని ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో పలు కీలక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఐటి ఇంటింటి సౌలభ్యంతో సునాయానాసంగా సుపరిపాలన, పారదర్శకత, దళారీల పాత్రలేని వ్కవస్థకు మార్గం ఏర్పడిందని ప్రధాని తెలిపారు.
ప్రధాని మోడీ నాయకత్వమే బలం
ఎన్‌డిఎ తరఫున చంద్రబాబు తీర్మానం ఆమోదం
బుధవారం ఇక్కడ జరిగిన ఎన్‌డిఎ సదస్సులో ఎన్‌డిఎ నేతలు ప్రత్యేక తీర్మానం వెలువరించారు. 12 ఏండ్ల పాలనలో మోడీ నాయకత్వ పటిమను కొనియాడుతూ తీర్మానం రూపొందించారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి , టిడిపి నేత ఎన్ చంద్ర బాబు నాయుడు ప్రతిపాదించిన తీర్మానానికినాగాలాండ్ సిఎం , ఎన్‌పిఎఫ్ నేత నియిఫూ రియో బలపర్చారు. ఇతర నేతల నుంచి ఏకగ్రీవ మద్దతు దక్కింది. మోడీ నాయకత్వానికి ఈ తీర్మానంలో ప్రశంసలు వెలువడ్డాయి. ఈ సమావేశానికి 75 మంది నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీన్ గడ్కరి ఇతరులు, ఎన్‌డిఎ మిత్రపక్షాలు, బిజెపి పాలిత సిఎంలు, కొందరు ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
వచ్చినవారందరికీ ప్రధాని మోడీ ఝాల్‌మురీ వంటకం స్పెషల్
ఎన్‌డిఎ సదస్సుకు వచ్చిన వారికి ప్రధాని మోమెచ్చిన ప్రత్యేక బెంగాళీ వంటకం ఝాల్‌మురి అందించారు. కోల్‌కతాలో ఈ చిరుతిండి ప్రత్యేకం. మసాలా పల్లీ పేలాల ఈ ప్రత్యేక స్టాల్ వద్ద నిలిచి ఇటీవలి బెంగాల్ ఎన్నికల ప్రచారం దశలో మోడీ కొనుక్కోడం, ఆరగించడం మీడియాలో ప్రచారం పొందింది. బెంగాల్‌లో సామాన్య జనం ఓటుకు దారితీసిందనే ప్రచారం జరిగింది.ఈ క్రమంలో ఇదే స్పెషల్‌ను ఇక్కడ మోడీ ఇష్టపడి అందరికి అందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ముందుగా దీనిని అక్కడి నుంచి పెద్ద ఎత్తున బెంగాల్ ముఖ్యమంత్రి సువేంధు అధికారి తెప్పించారు. ముందుగా ప్రధానికి అందించారు.













