మన తెలంగాణ/హైదరాబాద్: అంతరాష్ట్ర నదీ జలాల వివాదం పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోడీ పన్నెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా “దేశ నిర్మాణమే ఏకైక లక్షం” ఇంకా వారసత్వమే పరమావధి వంటి పలు పుస్తకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు బుధవారం పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారని చెప్పా రు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న వాదనను ఆయన ఖండించారు. అసలు లేఖ రాయలేదని మీరు చెబుతున్నా,

లేఖ రాసినట్లు సీఎం కార్యాలయం లేఖ ప్రతిని విడుదల చేసింది కదా? అని ప్రశ్నించగా, ఆయన తోసిపుచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్దం చెబుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చాలా మంచి వారని, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగితే ఇవ్వకపోవడం అనేది ఉండదన్నారు. ఇదంతా ఎందుకూ మహారాష్ట్ర సీఎం వద్దకు మన రాష్ట్ర సీఎంను తానే తీసుకెళతానని అన్నారు. ఈ మధ్య కాలంలో తనను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, తమ పార్టీని చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని రాంచందర్ రావు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కేసులు పెడతారని భయపడుతున్నారా? అని ప్రశ్నించగా, ఎదుగుదలను చూసి అని ఆయన సమాధానమిచ్చారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయన్న సామెతను ఆయన ఉదహరించారు.

నెహ్రూను మించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారని, ప్రజలచే ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని రాంచందర్ రావు తెలిపారు. దేశ చరిత్రలో వరుసగా ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారని అన్నారు. నెహ్రూ ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్నప్పటికీ, స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన పరిస్థితుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించారని చెప్పారు.

తెలంగాణపై వివక్ష లేదు..

కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, లక్షల కోట్ల రూపాయల విలువైన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అందించిందని రాంచందర్ రావు చెప్పారు. 2014కు ముందు యూపీఏ కాలంలో కేంద్ర పన్నుల పంపిణీ రాష్ట్రాలకు కేవలం 32 శాతం మాత్రమే ఉండేదన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల పంపిణీని ఏకంగా 42 శాతానికి పెంచారని, ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో ప్రస్తుతం రాష్ట్రాలకు 41 శాతం పన్నుల పంపిణీ కొనసాగుతోందని వివరించారు. దీనికి తోడు ఆర్థిక సంఘం సిఫారసులు, స్థానిక సంస్థలకు కేటాయింపులు కలిపి దాదాపు 49 శాతం వరకు కేంద్ర వనరులు రాష్ట్రాలకే చేరుతున్నాయని, ఇది దేశ చరిత్రలోనే రాష్ట్రాలకు జరిగిన అత్యధిక వనరుల బదిలీ అని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ద్వారా పన్నుల పంపిణీ, గ్రాంట్లు, ప్రత్యేక సహాయం రూపంలో గణనీయమైన నిధులు అందాయని, 2014 నుండి 2024 వరకు లక్ష కోట్ల రూపాయలకు పైగా గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ అందించినట్లు తెలిపారు. ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం కింద తెలంగాణకు 2020-21లో రూ.358 కోట్లు లభించగా, ౨


025-26 నాటికి అది దాదాపు పది రెట్లు పెరిగి రూ.4,209 కోట్లకు చేరుకుందన్నారు. రైల్వే రంగంలో తెలంగాణకు భారీ ప్రాధాన్యం లభించిందన్నారు. పుణే-హైదరాబాద్ జాతీయ రహదారి ఆరు లేన్ల విస్తరణ, హైదరాబాద్ ప్రాంతంలో వివిధ పైప్‌లైన్ ప్రాజెక్టులు, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మంచిర్యాల-వరంగల్ రైల్వే సెక్షన్, నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ వంటి అనేక కీలక ప్రాజెక్టులు భారతమా ఇతర పథకాల కింద వేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయని ఆయన వివరించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తెలంగాణలో రూ.86,600 కోట్లకు పైగా రుణాలు పంపిణీ జరిగిందని, అటల్ పెన్షన్ యోజన కింద 26.9 లక్షల మంది సభ్యులుగా చేరారన్నారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించగా, రాష్ట్రంలోనే ఏకంగా 7.61 లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని ఆయన తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద రాష్ట్రంలో 33.2 లక్షల కార్డులు జారీ చేయబడ్డాయని, జల్ జీవన్ మిషన్ ద్వారా 53.9 లక్షల గ్రామీణ కుటుంబాలకు ఇంటింటికీ తాగు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు చెప్పారు.

ఉజ్వల యోజన కింద 11.8 లక్షల గ్యాస్ కనెక్షన్లు పేద కుటుంబాలకు ఇచ్చారని, జనఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణలో 182.7 లక్షల ఆయుష్మాన్ కార్డులు జారీ చేయబడ్డాయని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ ద్వారా రాష్ట్రంలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారన్నారు. అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.6,000 పెట్టుబడి సహాయం అందుతున్నదని వివరించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోయినా, ప్రధాని ఎలాంటి వివక్ష లేకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రగతికి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలు అందించారని రాంచందర్ రావు వివరించారు.