
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీబీజీ రాం జీపై కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కీలక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. ఈ కారణంగా తాను ఆదివారం సాయంత్రం నల్లగొండ కేంద్రంగా సీఎం చేతుల మీదుగా ప్రారంభ కానున్న హ్యాం రోడ్ల శంకు స్థాపన కార్యక్రమానికి హజరు కాలేకపోతున్నానని ఒక ప్రకటనలో వెల్లడించారు. సోదరుడు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నివాసానికి విచ్చేసి స్వయంగా ఆహ్వనించిన సభకు వెల్లలేకపోతున్నందుకు చింతిస్తున్నానని తెలిపారు. పోరాటాల పురిటి గడ్డ నల్గొండ కేంద్రంగా ప్రారంభ మైన హ్యాం రోడ్ల నిర్మాణం విజయవంతం అవుతుందని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ, మా మంత్రివర్గ సహచరుల సమిష్టి కృషితో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నూతన శకం ప్రారంభం కానుందని ఆమె వ్యాఖ్యానించారు.












