విక్టోరియా (సీషెల్స్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ఆదివారం ప్రతిష్ఠాత్మక గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ గౌరవ బిరుదును ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షల సాధనకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేసింది. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఈ బిరుదును మోదీకి అందజేశారు. సీషెల్స్ చరిత్రలో ఈ గౌరవాన్ని ప్రదానం చేయడం ఇదే తొలిసారి. అలాగే విదేశీ దేశం నుంచి మోదీ అందుకున్న 34వ అంతర్జాతీయ గౌరవంగా ఇది నిలిచింది.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని సీషెల్స్ ప్రజలకు, ప్రభుత్వానికి, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీకి కృతజ్ఞతలు తెలుపుతూ స్వీకరిస్తున్నానని చెప్పారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ, భావితరాల కోసం పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా భావిస్తున్న అన్ని దేశాలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూమిని మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చేందుకు అవసరమైన ప్రతి చర్యకు భారత్ కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. దేశీయ విధానాలు, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కూటమి, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలు అందుకు నిదర్శనమని చెప్పారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తెలిపిన వివరాల ప్రకారం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెంపు, బ్లూ ఎకానమీ అభివృద్ధి, చిన్న ద్వీప దేశాల అభ్యున్నతికి మోదీ అందించిన నాయకత్వానికి గుర్తింపుగానే ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ మాట్లాడుతూ, మా సముద్ర సంపదకు సంరక్షకుడిగా నిలిచిన నాయకత్వం, భాగస్వామ్య స్ఫూర్తికి గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవాన్ని అందిస్తున్నాం. ఇది మా దేశ ప్రజల అత్యంత గౌరవాభిమానాలకు ప్రతీక అని అన్నారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం సీషెల్స్‌కు చేరుకున్న మోదీ, అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అలాగే సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నెల ప్రారంభంలో మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్) కూడా ప్రదానం చేసిన విషయం తెలిసిందే.