
దక్షిణాఫ్రికా విమాన ప్రమాదంలో హసన్‌పర్తి మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఆడెపు సుమంత్ (25) దుర్మరణం చెందాడు. ఆడెపు వరలక్ష్మి చంద్రమోహన్ దంపతుల చిన్న కుమారుడైన సుమంత్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసుకున్నాడు. గత 8 నెలలుగా దక్షిణాఫ్రికాలో సుమంత్ పైలెట్‌గా శిక్షణ పొందుతున్నాడని, ఇందులో భాగంగానే శనివారం దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్‌బర్గ్‌లో సుమంత్ విమానాన్ని స్టార్ట్ చేసిన కొద్ది నిమిషాలకే ప్రమాదం జరిగిందని సమాచారం.
విమానం కూలడానికి సాంకేతిక లోపమా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. విమానం ప్రమాదానికి గురైన సమయంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలెట్లలో ఒకరు సీతంపేట గ్రామానికి చెందిన యువకుడు ఆడెపు సుమంత్ కాగా, ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆడెపు సుమంత్ మరణ వార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీంతో సీతంపేట గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












