ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీ సభలు

6న వరంగల్‌లో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ హామీలపై బిఆర్‌ఎస్ బహిరంగ సభ

5వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు హన్మకొండలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలు

రైతులకు సంకెళ్లు వేసింది బిఆర్‌ఎస్సే ఇప్పుడు వాళ్లపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏండ్ల వ్యవధి ఉన్నప్పటికీ అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా నిర్వహిస్తోన్న సభలు ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం స న్నాహాలు చేసుకుంటుండగా, గ్రామ పంచాయ తీ, మున్సిపల్ ఎన్నికలలో వన్‌సైడ్‌గా విజయాన్ని సొంతం చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలలోనూ అదే జోరు కొనసాగించేందుకు వ్యూహరచన చేస్తోంది. కనీసం ఈ సారి స్థానిక పరిషత్ ఎన్నికలలోనైనా తన సత్తా చాటాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా ధీటుగా ముందస్తు వ్యూహాన్ని పన్నుతోంది.

ఈ నేపథ్యంలో ఇంతకాలం మౌనంగా ఉన్న బీఆర్‌ఎ స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వచ్చి గత నెలలో సీనియర్ కాంగ్రెస్ నేత టీ.జీవన్‌రెడ్డి గులాబి కండువ కప్పుకున్న సందర్భంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విష యం తెలిసిందే. ఈ సభకు ధీటుగా అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూపాలపల్లి జిల్లాలో స భ నిర్వహించి రైతు భరోసా రెండో దశకు శ్రీకారం చుట్టి రైతుల ఖాతాలలో డబ్బులు వేసిన విషయం తెలిసిందే. తాము సభ పెట్టడం వల్లనే రైతుల ఖాతాలలో రైతు భరోసా సాయాన్ని జమ చేసిందని బీఆర్‌ఎ స్ అధినేత కేసీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు.

అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అందుకు నిరసనగా అదే వరంగల్‌లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ పార్టీ ఈ నెల 6న రైతు డిక్లరేషన్ అమలులోవిఫలం అయిందని ఆరోపిస్తూ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సభా వేదికను వరంగల్ హంటర్ రోడ్‌లో ఐదు ఎకరాల మైదానంలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు కూడా పోటిగా కాంగ్రెస్ పార్టీ ఒక రోజు ముందు నుంచే ఈ నెల 5 నుంచి మూడు రోజుల పాటు కిసాన్ మేళా పేరిట హనుమకొండ ఆర్ట్ కాలేజి మైదానంలో ఏర్పాట్లు చేస్తోంది. మొదటి రోజు (5వ తేదిన) జరిగే కిసాన్ మేళాకు వరంగల్ ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతుండగా, రెండవ రోజు (బీఆర్‌ఎస్ సభ జరిగే 6న) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరు అవుతారని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటి ప్రకటించింది.

తమ రైతు డిక్లరేషన్ వైఫల్య సభకు పోటిగానే కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసిందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఆరోపణను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ‘99 రోజుల ప్రజాపాలన...ప్రగతి నివేదిక ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, అందులో భాగంగానే ఈ నెల 5 నుంచి 7 వరకు వరంగల్‌లో రైతు వారోత్సవాలను నిర్వహిస్తోందని ఆ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్‌ఎస్సే: మంత్రి పొంగులేటి

మన తెలంగాణ/హైదరాబాద్: మద్దతు ధర కోరిన రైతులను ఖమ్మంలో బేడీలు వేసి అవమానించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే పార్టీ రైతులపై కపట ప్రేమ చూపిస్తూ మాయ మాటలు మాట్లాడటం హాస్యాస్పదమని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో ఏఐసిసి అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మాటలకే పరిమితమైన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రైతు కమిషన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.పదేళ్ల పాలనలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు కూడా అందించని బీఆర్‌ఎస్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో మే 5, 6, 7 తేదీలలో వరంగల్‌లో నిర్వహించే రైతు వారోత్సవాలు కార్యక్రమంలో రైతులకు సబ్సిడీపై ఆధునిక వ్యవసాయ పనిముట్ల పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయడం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించడం, కేవలం వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం వంటి చర్యలు రైతు పక్షపాత పాలనకు నిదర్శనమని అన్నారు. ఇప్పటివరకు 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల చొప్పున రుణమాఫీ చేయడం, రైతు భరోసాను ఎకరానికి రూ.12 వేలకు పెంచడం ద్వారా రైతన్నకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. రైతన్నలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.