
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అడవిలో బీడీ ఆకులు సేకరించేందుకు అడవికి వెళ్లిన మహిళలపై శుక్రవారం ఉదయం పులి దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గుంజేవాహి గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని కంపార్ట్‌మెంట్-1836 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే పులి దాడి చేసిందా, లేక ఒకటికంటే ఎక్కువ పులులు ఉన్నాయా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు పేర్కొన్నారు. 10 నుంచి 13 మంది మహిళలు కలిసి బీడీల తయారీలో ఉపయోగించే తెండు (బీడీ) ఆకులు సేకరించేందుకు అడవికి వెళ్లారు. ఈ సమయంలో పులి మాటు వేసి దాడి చేయడంతో కవాడాబాయి మోహుర్లే (45), అనితాబాయి మోహుర్లే (40), సునీతా మోహుర్లే (38), సంగీతా చౌదరి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా గుంజేవాహి గ్రామానికి చెందినవారని అధికారులు తెలిపారు.
పులి కదలికలను గమనించేందుకు అటవీశాఖ 30 కెమెరా ట్రాప్‌లు, మూడు లైవ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఫీల్డ్ సిబ్బంది, ప్రత్యేక బృందాలతో గస్తీని మరింత పెంచినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని చంద్రపూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.ఎం. రామానుజన్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తెండు ఆకుల సేకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రహ్మపురి డివిజన్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ డాక్టర్ కుమారస్వామి ఎస్.ఆర్ నేతృత్వంలోని బృందం, సిందేవాహి పోలీసులతో కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిందేవాహి గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.25 వేల చొప్పున అందజేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేయడం, పోస్టర్లు ఏర్పాటు చేయడం, పులుల సంచారంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలను ఇప్పటికే చేపట్టామని, ఈ ఘటన అనంతరం వాటిని మరింత విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు.












