ROFR పట్టా భూముల అభివృద్ధి, అటవీ ప్రాంతాల్లో బోర్‌వెల్ల తవ్వకాల విషయంలో ఎదురవుతున్న విధానపరమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంయుక్తంగా లేఖ రాయనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మండా మకరందు, అటవీశాఖ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు.
అటవీ హక్కుల చట్టం-2006 అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఉట్నూర్ మండలంలో ROFR పట్టాదారులపై సామాజిక తనిఖీ నిర్వహిస్తోంది. డోంగచింత, భీర్సాయిపేట గ్రామపంచాయతీలను సామాజిక తనిఖీ, ప్రజా విచారణ కోసం ఎంపిక చేశారు. ఆగస్టు 2 నుంచి 9 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించగా.. ఆగస్టు 11న ప్రజా విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ROFR పట్టాలు పొందిన ఆదివాసీ రైతులు పోడు భూముల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పట్టాదారులు మరణించిన తర్వాత వారి చట్టబద్ధ వారసులకు పట్టాలను బదిలీ చేయడంలోనూ సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.








