తెలంగాణలోని గణేశా ఎకోస్ఫియర్ అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న రీసైక్లింగ్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, పొగ పీల్చడం వల్లే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక చర్యలు పూర్తయ్యాక ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
గురువారం జరిగిన ఈ ప్రమాదంలో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, లోపల చిక్కుకున్న ఇద్దరు ఉద్యోగులు పొగ ప్రభావంతో మృతి చెందారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మృతుల కుటుంబాలకు గణేశా ఎకోస్ఫియర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. వారికి అవసరమైన ఆర్థిక సహాయం, ఇతర మద్దతు అందిస్తామని కంపెనీ ప్రకటించింది. ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కూడా తెలిపింది.
ఈ ఘటనతో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది. ప్రమాదం సమయంలో అన్ని భద్రతా నిబంధనలు పాటించబడాయా అనే అంశంపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.











