నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ మరో కీలక నిందితురాలిని అరెస్ట్ చేసింది. పుణేకు చెందిన లెక్చరర్ మనీషా సంజయ్ హవల్దార్‌ను ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్ని కొందరు అభ్యర్థులకు లీక్ చేసిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పుణేలోని సేఠ్ హీరాలాల్ సరాఫ్ ప్రశాలాలో పనిచేస్తున్న హవల్దార్‌ను ప్రశ్నాపత్రం లీక్‌కు ప్రధాన ‘సోర్స్’గా సీబీఐ గుర్తించింది. సీబీఐ ప్రకటన ప్రకారం, హవల్దార్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నీట్ యూజీ ప్రక్రియలో నిపుణురాలిగా నియమించింది. దీంతో ఆమెకు ఫిజిక్స్ ప్రశ్నాపత్రంపై పూర్తి ప్రాప్యత లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె కొంతమంది ప్రశ్నలను సహనిందితురాలు మనీషా మంధారేకు పంపినట్లు సీబీఐ ఆరోపించింది.

మంధారే పుణేకు చెందిన బోటనీ టీచర్‌గా పనిచేస్తుండగా, ఆమెను ఇప్పటికే మే 16న అరెస్ట్ చేశారు. హవల్దార్ లీక్ చేసిన ప్రశ్నలు నీట్ యూజీ-2026 ఫిజిక్స్ ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ వెల్లడించింది.దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువులపై విశ్లేషణ కొనసాగుతోందని తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను మే 12న రద్దు చేసింది. తిరిగి పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.