
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్-2 అనుమతులతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సిఎం రేవంత్‌రెడ్డి కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి వారికి విజ్ఞప్తి చేయనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అపాయింట్‌మెంట్ లభించినట్టుగా తెలిసింది. దీంతోపాటు మరో ఇద్దరు కేంద్రమంత్రులను సైతం సిఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సిబిఐ డైరెక్టర్‌ను కూడా సిఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని సమాచారం. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, భద్రాద్రి, యాదాద్రి పవర్‌ప్లాంట్‌లపై జరిగిన ఆర్థిక అక్రమాలపై జస్టిస్ లోకూర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేయాలని సిబిఐ డైరెక్టర్‌ను కలిసి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నట్టుగా తెలిసింది. సోమవారం కేబినెట్‌లో భేటీలోనూ ఈ అంశంపై చర్చించిన మంత్రివర్గం దీనికి ఆమోదం సైతం తెలిపిన సంగతి తెలిసిందే.
కెసి వేణుగోపాల్‌తో భేటీ
కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీ తదితర అంశాలపై అధిష్టానంతో సిఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు కేరళలో యూడిఎఫ్ ఘన విజయం సాధించడంతోనూ సిఎం రేవంత్‌రెడ్డి ప్రముఖపాత్ర పోషించారు. అయితే, కేరళలో యూడిఎఫ్ విజయం సాధించిన నేపథ్యంలో కేరళ సిఎం అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉండడంతో, కెసి వేణుగోపాల్ కూడా సిఎం రేసులో ఉండడంతో కెసి వేణుగోపాల్‌ను కూడా సిఎం రేవంత్‌రెడ్డి కలిసే అవకాశం ఉందని తెలిసింది. దీంతోపాటు పలు అంశాల గురించి అధిష్టానంతో సిఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.











