
హైదరాబాద్: మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. గ్రామీణ మహిళలకు ఆర్థిక, సామాజిక, పరిపాలనా కేంద్రాలుగా మహిళా భవనాలు నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్త్రీశక్తి, అంగన్ వాడి భవనాలు, సోలార్ ఆర్టిసి బస్సులను ఈ వారంలో ప్రారంభించుకున్నామని అన్నారు. 8 వేల ఇందిరా స్ర్తీ శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, మహిళా సంఘాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాలు అందిస్తున్నామని తెలియజేశారు. రెండున్నరేళ్లలోనే ఇప్పటి వరకు రూ.6 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం జరిగిందని, రూ. 5లక్షల నుంచి రూ.10 లక్షలకు వడ్డీ లేని రుణాలు పెంచి మహిళా సంఘాలకు అందిస్తున్నామని అన్నారు. మహిళలను అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని రేవంత్ పేర్కొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కొందరు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. ఆటో డ్రైవర్లను, కార్మికులను రెచ్చగొట్టి మహిళలకు ఉచిత బస్సు పథకానికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడాలని జిల్లా కేంద్రాల్లో పెట్రోల్ బ్యాంకుల వ్యాపార అవకాశం కల్పించామని అన్నారు. మహిళలు ప్రతీ రూపాయి బ్యాంకులకు చెల్లించి తమ విజయ పరంపర కొనసాగిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైస్ మిల్లులు, గోడౌన్లు పెట్టుకోండని ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. దళారులు, వ్యాపారులు రైతుల్ని దగా చేస్తున్నారని, ఇకపై మహిళ సంఘాల వద్దే వడ్డను భద్రపరుస్తామని, నాణ్యమైన వస్తువు కొనాలంటే.. మహిళా శక్తి సంఘాల వద్దే కొనాలనేకునేలా బ్రాండ్ వాల్యు పెంచుకోండని రేవంత్ రెడ్డి సూచించారు.










