ప్రభుత్వ విద్యా రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ తెలంగాణలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (TPS) బుధవారం ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య అందించేలా రూపొందించిన ఈ స్కూల్‌లో ఆధునిక తరగతి గదులు, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీ, క్రీడా మైదానాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉచిత బస్సు రవాణా, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందించనున్నారు.
ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 1,800కు పైగా అడ్మిషన్లు రావడంతో ఈ స్కూల్‌లో "నో అడ్మిషన్" బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.












