
ఇప్పటికే ముగిసిన నిందితుడు మధు పోలీస్ కస్టడీ
తదుపరి విచారణలో మంగ్లీ, సోదరుడు శివ పాత్రపై ఆరా తీయనున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: మైక్రో ఫైనాన్స్ కేసులో నిందితుడిగా ఉన్న హేమకాంత రెడ్డిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో ఇదివరకే రమావత్ మధును సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కస్టడీకి తీసుకొని పోలీసులు మూడు రోజులు విచారించారు, కస్టడీ ముగియడంతో శనివారం మధును జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే హేమకాంతరెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి, కస్టడీకి తీసుకోనున్నట్లు తెలిసింది. మధు, హేమకాంతరెడ్డి ఇద్దరిని విచారిస్తే మైక్రో ఫైనాన్స్ కేసులోని అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఇద్దరికి మంగ్లీ, ఆమె సోదరుడు శివ స్నేహితుడు కావడంతో ఆ కోణంలో విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమావత్ మధు శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించి పలువురి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఐదు లక్షలు కడితే నెలకు రూ.25,000, 102 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పడంతో 30 మంది వద్ద నుంచి రూ.12 కోట్లు వసూలు చేశాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ పోలీసులు రమావత్ మధు, హేమకాంత రెడ్డిని అరెస్టు చేశారు.
ఈ ఇద్దరు, మంగ్లీ, ఆమె సోదరుడు శివ కలిసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హేమకాంతరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రమావత్ మధు బ్యాంక్ ఖాతా నుంచి మంగ్లీ బ్యాంక్ ఖాతాకు మూడు ట్రాన్‌జాక్షన్ల ద్వారా డబ్బులు వెళ్లినట్లు తెలియడంతో పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేస్తున్నారు. ఖాతాల వివరాలు ఇవ్వాలని పోలీసులు బ్యాంక్ అధికారులకు లేఖలు రాశారు.











