
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రా జకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’(టిఆర్‌ఎస్)గా నామకరణం చేశారు. ఈ మేరకు శనివారం మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో వేదికగా ఉదయం 10 గంటలకు అభిమానుల కో లాహలం మధ్య పార్టీ కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) పార్టీని, పసుపు, నీలం రంగులో ఉన్న పార్టీ జెండాను ప్రకటించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జాగృతి కార్యకర్తలు తెలంగాణ సాంస్కృతిక దీపాన్ని పదిలంగా కాపాడుకున్నారని చెప్పారు. ఉద్యమకాలంలో ప్రజల కోసం పరితపించిన కెసిఆర్ ఇప్పుడు గుం టనక్కలు, తోడేళ్ల చేతిలో బంది అయ్యారని.. ఆయ న ఇప్పుడు మన కెసిఆర్ కాదు.. మరబొమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణాకు ఏదైనా జరిగితే ప్రా ణం పెట్టి పని చేసే పార్టీ కావాలని అందుకోసమే తాను టిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సేన అజెండాను కవిత వివరించారు. పాంచజన్యం పేరుతో ఐదు అంశాలపై హామీ ఇచ్చారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, ఉపాధి, సామాజిక న్యాయం అనే అంశాలపై దృష్టి పెడతామని ప్రకటించారు. కెజి నుంచి పిజి వరకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివిన కూడా ప్రజలపై రూపాయి భారం పడనివ్వమని చెప్పారు. అందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు. రైతులు గర్వంగా చెప్పుకునేలా చేస్తామని వెల్లడించారు. 24 గంటల ఉచిత కరెంట్, యూరియ సహా రైతు సంక్షేమానికి చేయాల్సివన్నీ చేస్తామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయటమే లక్ష్యం అని పేర్కొన్నారు. ఉపాధి విషయంలోనూ తమకు స్పష్టమైన విజన్ ఉందని చెప్పారు.
యువతకు ఉపాధి అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, వారి వద్ద మంచి వ్యాపార ఆలోచన ఉంటే 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు ప్రభుత్వమే రుణం అందించి వారిని ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఒకటే నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారులు తమ యవ్వనాన్ని ఉద్యమంలో కోల్పోయారని చెప్పారు. వారి కోసం 2014,జూన్ 2ను కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. హిందీలో తియ్యగా మాట్లాడి బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మైనార్టీలను మోసం చేశాయని చెప్పారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు రాజకీయ అధికారం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మహిళ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటు చిరు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు.
రేవంత్ రెడ్డి కర్కోటకుడు.. నియంత
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...కర్కోటక, నియంత సిఎం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్లలో అన్ని పర్మిషన్లు ఉన్నా సరే అక్కడి ప్రజల ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతో ఒక గర్భిణీకి అబార్షన్ అయితే ఆమె తండ్రి రోదన కళ్ల ముందు ఇంకా మెదులుతుందని చెప్పారు. రెండు నెలల చిన్నారిని కాళ్లతో తన్ని చంపితే ఇప్పటికీ కూడా కేసు పెట్టలేదన్నారు. గురుకులాల్లో విషం పెట్టి విద్యార్థులను చంపుతుంటే ఈ ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. కర్ల రాజేష్ అనే యువకుడిని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఈ ముఖ్యమంత్రిని కర్కోటక, నియంత ముఖ్యమంత్రి అంటున్నానని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం కాంగ్రెస్ అజెండా అయితే పెద్ద సార్ ఫామ్ హౌస్‌లో ఉండి...చిన్న సార్‌ను సిఎం చేయాలన్నది బిఆర్‌ఎస్ అజెండా అని పేర్కొన్నారు. ఇక సామాజిక న్యాయాన్ని ఖతం పట్టించటమే బిజెపి సింగిల్ అజెండా అని చెప్పారు. ఈ మూడు పార్టీల మీద అలుపెరగని పోరాటం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సేన సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అమ్మగా పరిపాలన అందిస్తా
తెలంగాణలో 3.50 కోట్ల మంది ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తానని కవిత చెప్పారు. అమ్మతనంతో పాలన చేస్తేనే బిడ్డల కష్టం తెలుస్తుందన్నారు. తెలంగాణలో ఏళ్ల తరబడి నడిచిన భూస్వామ్య వ్యవస్థపై ఎందరో మహానుభవులు పోరాడితేనే సమానత్వం వచ్చిందన్నారు. మలిదశలో కెసిఆర్, ఉద్యమకారులు పోరాడితే కొత్త రాష్ట్రం వచ్చిందని తెలిపారు. ఇప్పుడు తాము రాజకీయ శక్తితో పాటు ప్రజా పోరాటాలను మిళితం చేసి సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పారు. తల్లి జేబు చూడదు...కడుపు చూస్తుందని చెప్పారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తామే ఉంటామని...మరో రెండేళ్లలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్ పాలనలో దారి తప్పిన తెలంగాణ రథ చక్రం
తెలంగాణ సాధించుకున్న తర్వాత కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రథ చక్రం దారి తప్పిందని కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆర్తిని అర్థం చేసుకోవటంలో బిఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను రాసుకోవటానికి తాను కొత్త పార్టీతో ముందుకు వచ్చానని చెప్పారు. తన తండ్రి కెసిఆర్ మీద కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆనాటి కెసిఆర్, నేటి కెసిఆర్ వేరు అని పేర్కొన్నారు. ఆనాటి కెసిఆర్ చేనేత కార్మికులు చనిపోతే బిక్షాటన చేసి సాయం చేశారని గుర్తు చేశారు. కానీ మారిన, మర మనిషి కెసిఆర్ ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్న బయటకు రావటం లేదని ఘాటు విమర్శలు చేశారు.
అవినీతి చేస్తే కొడుకునైనా, కూతురినైనా సరే వదలనని కెసిఆర్ గతంలో చెప్పారని కవిత గుర్తు చేశారు. కానీ తాను కాళేశ్వరంలో అవినీతి జరుగుతుందని చెబితే, ఆ అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకొని తననే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కెసిఆర్ బందీ అయ్యారని అన్నారు. తాను ఎన్ని మాట్లాడినా బిఆర్‌ఎస్ నేతలకు సమాధానం చెప్పటం చేతకావటం లేదని ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే ప్రజలే బయకు లాగి సమాధానం చెప్పేలా చేస్తారన్నారు.
సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి బిజెపి
బిజెపి అంటేనే సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత విమర్శించారు. ఆ పార్టీ పెద్దలకు అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదని చెప్పారు. ఒకరు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అంటే మరొక తలకాయ లేని ఎంపి తెలంగాణ ఏర్పాటును ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోల్చడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన సరే ఇక్కడి బానిస ఎంపీలు నోరు మెదపటం లేదని అన్నారు. దటి నుంచి కూడా బిజెపి సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి అని కవిత అన్నారు. మహిళ బిల్లును, కుల గణన,బిసి బిల్లును తొక్కి పెట్టారన్నారు. పేదలకు కూడు పెట్టే ఉపాధి హామీ పథకాన్ని కూడా లేకుండా చేశారని విమర్శించారు.
అమర వీరులకు నివాళులు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్‌ఎస్) పార్టీ ప్రకటనకు ముందు బంజారాహిల్స్‌లోని తమ నివాసంలో కవిత, అనిల్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కవిత అత్తామామల ఆశీర్వాదం తీసుకుని సర్వమత ప్రార్థనలు చేశారు.అనంతరం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద వెళ్లి నివాళులర్పించి, అక్కడి నుంచి భారీ ర్యాలీగా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. వేదికపైకి చేరుకొని కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేశారు. అనంతరం పార్టీ పేరును ప్రకటించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పార్టీ జెండాను రూపొందించారు. కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పార్టీ ప్రకటన అనంతరం క్యాడర్‌తో కలిసి కల్వకుంట్ల కవిత భారీ ర్యాలీగా హైదరాబాద్‌కు తిరిగివచ్చారు.











