న్యూఢిల్లీ: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. దాదాపు 18 ఏళ్ల క్రితం ఐపిఎల్‌లో చోటు చేసుకున్న ‘చెంప దెబ్బ’ సంఘటనపై శ్రీశాంత్ నోరు విప్పాడు. హర్భజన్ సింగ్ ఈ సంఘటనను వ్యాపార లావాదేవిల కోసం వాడుకుంటున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. భజ్జీ తనపై చేసిన దాడిని సాకుగా చూపుతూ కోటి రూపాయల వరకు ఆదాయం గడించాడని విమర్శించాడు.

ఓ టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘హర్భజన్ ఆనాటి చేదు ఘటనను మార్కెట్ చేసుకుంటున్నాడని, ఇటీవల భజ్జీ ఓ యాడ్ చేశాడని, ఆ యాడ్ ద్వారా రూ. కోటి సంపాదించాడన్నాడు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి, ప్రమోట్ చేయమని ఫోన్ చేశాడని, ఆ విషయం తనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించిందన్నాడు. నేను భజ్జీని క్షమించాను. కానీ, ఆ ఘటన నాకు ఎప్పటికి గుర్తుకొస్తూనే ఉందని తెలిపాడు శ్రీశాంత్.