మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రివ ర్గ సమావేశం నేడు (శనివారం) సచివాలయం లో మధ్యాహ్నాం 3 గంటలకు జరుగనుంది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై మంత్రివ ర్గం కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోనుం ది. ముఖ్యంగా జూన్ 02వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని కొత్త పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపై కేబినెట్ చర్చించనున్నట్టు గా తెలిసింది. దీంతోపాటు భూముల విలువ పెంపు, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మాణం, రెం డోవిడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభంతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరుగనున్నట్టుగా సమాచారం.

రాష్ట్రంలో భూము ల విలువల పెంపు దాదాపు ఖరారు కాగా, ప్రాంతాల వారీగా ఎంత పెంచాలన్న దానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందించారు. అయితే గరిష్ఠంగా వంద శాతం మించి విలువలను పెంచకుండా సీలింగ్ పెట్టాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే కనిష్టంగా 5 శాతం నుంచి 100 శాతం వరకు భూముల విలువలను పెంచుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి కొత్త విలువల ప్రకారం స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం. భూముల విలువలు పెంపునకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి ఆమోదముద్ర వేయనున్నట్టుగా తెలిసింది.

పలు సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం

వీటితో పాటు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై కేబినెట్‌లో చర్చించనున్నట్టుగా సమాచారం. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిపే అవకాశం ఉందని తెలిసింది. దీంతో పాటు రైతులు, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు, అంశాలపై చర్చించి ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో పాటు మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు,

సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల పనితీరు వంటి అంశాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గత సమావేశాల నిర్ణయాల అమలు పురోగతిపై కూడా మంత్రివర్గం సమీక్ష చేయనున్నట్టుగా సమాచారం. కేబినెట్ సమావేశానికి ముందు అన్ని శాఖల నుంచి నివేదికలు అందించగా, పూర్తి వివరాలతో సమావేశానికి హాజరుకావాలని మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ కేబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కీలక నిర్ణయాలు, కొత్త విధానాలు ప్రకటించే అవకాశం ఉండటంతో కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.

నేడు ఉదయం 11.15 గంటలకు యాదగిరిగుట్ట నుంచి తిరిగి హైదరాబాద్‌కు పయనం

ఈనెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి సిఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు హెలీక్యాప్టర్‌లో వెళ్లనున్నారు. అక్కడ టెంపుల్ సిటీలోని లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాలకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పై కప్పు, ప్రధానాలయం వాయువ్య దిశలో మాడ వీధుల్లోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి కూడా సిఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 11.15 గంటలకు యాదగిరిగుట్ట నుంచి తిరిగి హైదరాబాద్‌కు సిఎం రేవంత్‌రెడ్డి బయలుదేరనున్నారు.