ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఓటములతో సతమతమవుతోంది. బుధవారం ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగులు చేసినా.. పరాజయం మాత్రం తప్పలేదు. ముఖ్యంగా స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో విఫలమవుతున్నాడు. వికెట్లు తీయడం మాట అటుంచితే... భారీగా పరుగులు సమర్పిస్తున్నాడు. దీంతో బుమ్రా ప్రదర్శనపై విమర్శలు వస్తున్నాయి. బుమ్రాని జట్టు నుంచి తప్పించాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై కోచ్ కీరన్ పొలార్డ్ బుమ్రాకు మద్దతుగా నిలిచాడు.

‘‘ఎవరైనా క్రికెటర్ సరిగా ప్రదర్శన చేయలేకపోతే.. వెంటనే ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించడం మొదలు పెడతాం. ఎందుకు అతడు సరిగా ఆడలేకపోతున్నాడనే దానిపై విశ్లేషణలు చేసేస్తుంటాం. ఇందుకు బుమ్రా కూడా మినమహాయింపు కాదు. గత కోన్నేళ్లుగా అతడు ఏం చేశాడో మనం చూశాం. అతడు కూడా మనిషే కదా. బుమ్రా కూడా మిస్టేక్స్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మంచి రోజు కాకపోవచ్చు. మంచి సీజన్ కాకపోవచ్చు. కొన్ని నెలలు కలిసి రాకపోవచ్చు. ఇలాంటప్పుడే గతంలో చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో వర్తమానంలో ఉండేందకు ప్రయత్నించాలి, బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయినా, ఇప్పటికీ అతడు ప్రపంచం‌లోనే నెం.1 బౌలర్. ముంబై ఇండియన్స్‌కూ కీలక బౌలర్’’ అని పొలార్డ్ తెలిపాడ.