హైదరాబాద్: కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల పేర్లు ఇరికించాలని చూస్తున్నారని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలను పోలీస్ అధికారులు పాటించవద్దు అని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎస్ఐబి చీఫ్ టి.ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో ఊరట కలిగించందని, కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ అడ్డుకోవాలని చూసినా..ప్రభాకర్ రావుకు ఉపశమనం లభించిందని, ఓ కరుడుగట్టిన నేరస్తుడిలాగా 18 రోజులు ఆయన్ని టార్చర్ చేశారని విమర్శించారు. పోలీస్ స్టేషన్ లో నేల మీద పడుకోబెట్టి వేధించారని మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు ఛార్జిషీటులో పెట్టాలని కుట్ర జరుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యక్తి మీద 26 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఢిల్లీ ఎయిర్ పోర్టులో అతడిని నిర్బంధించారని ధ్వజమెత్తారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ సంధ్యా శ్రీధర్ రావు వాలిపోతాడని, అతడితో బలవంతంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు చెప్పించారని అన్నారు.

ఇంకా చాలామందిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసులో సీనియర్ జర్నలిస్టును కూడా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ వస్తుందని, అక్రమ కేసు బనాయించి 45 రోజులు జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు పేరు చెప్పాలని ఆయనను పోలీసులు బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు గమనించారని అన్నారు. తెలంగాణ ప్రదాత కెసిఆర్ ను ఆయన స్వగృహంలో విచారించకుండా..నందినగర్ ఇంటి గోడలకు నోటీసులు అంటించారని మండిపడ్డారు. తెలంగాణ కోసం నిద్రాహారాలు మాని, ఎందరో మేధావులతో చర్చలు జరిపిన ఇంట్లో కెసిఆర్ ను పోలీసులు విచారించారని చెప్పారు. కెటిఆర్, హరీష్ రావులను కూడా అదే పద్ధతిలో విచారణ చేశారని, ట్యాపింగ్ అనేది పోలీసు శాఖలో ఒక చిన్న డిపార్టుమెంట్ చేసే వ్యవహారమని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గోప్యంగా ఉంచాలని..బయటపడకూడదని సూచించారు. పోలీసు శాఖలోనే 99శాతం మందికి ట్యాపింగ్ ఎక్కడ చేస్తారో తెలియదని, కానీ, ఆ డిపార్ట్ మెంట్ ను ఈ ప్రభుత్వం పూర్తిగా బయటపడేసిందని అన్నారు. నంబినారాయణ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను కోర్టు దోషులుగా పేర్కొందని, బాధితుడికి రూ.1.30 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిందని అన్నారు. రేపు తెలంగాణ పోలీసులకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఫార్ములా కేసు, ట్యాపింగ్ కేసు, ఇతర కేసుల్లో..లేనిది ఉన్నట్లుగా నిరూపించే ప్రయత్నం చేయకండని కోరారు. నిందుతులను బెదిరించి బలవంతంగా పేర్లు చెప్పించకండని, రాబోవు కాలంలో అవి మీ మెడకే చుట్టుకుంటాయని అన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా చట్టబద్ధమైన విచారణ జరుగుతుందని, మీపై ప్రజా తిరుగుబాటు ఖాయం అని తప్పుడు ఆధారాలు క్రియేట్ చేసి తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే చర్యలు తప్పవు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.