
అమరావతి: గర్భవతిగా ఉన్న భార్యను భర్త చంపేసి అనంతరం గుండెపోటుతో చనిపోయిందని నమ్మించాడు. ఫోరెన్సిక్ నివేదికలో హత్యగా తేలడంతో భర్తతో మామను అరెస్టు చేసి రిమాండ కు తరలించారు. ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైకాలూరు మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....... ఏలూరు జిల్లా మండవల్లి మండలం లోకుమూడికి చెందిన ప్రదీప్ అనే యువకుడు, ఎన్టిఆర్ జిల్లాకు చెందిన మేఘనను పెళ్లి చేసుకున్నాడు. అట్లతద్ది వాయినాల కోసం మేఘన పుట్టింటికి వెళ్లడంతో ఆమెపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇష్టం లేని కార్యక్రమానికి వెళ్తావా? అని గొడవ పెట్టుకోవడంతో భార్య తన ఇంటికి తీసుకరాలేదు. ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. పెద్ద మనుషుల సమక్షంలో భార్యను ఇంటికి తీసుకెళ్లాలని భర్తకు సూచించారు. తన ఇంటికి వచ్చినప్పటి నుంచి భార్యను చంపేందుకు భర్త ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఫిబ్రవరి 9న అర్థరాత్రి భార్య నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి దిండు ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం తన భార్య గుండెపోటుతో చనిపోయిందని బంధువులు, స్థానికులను నమ్మించాడు. మృతదేహంపై ఎక్కడా గాయపు మరకలు లేకపోవడంతో అందరూ గుండెపోటుతో మృతి చెందిందని అనుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడంతో మేఘనది హత్యగా తేలడంతో భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే ప్రదీప్ తో పాటు ఆయన తండ్రిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.












