మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ’వాల్తేర్ వీరయ్య’ సంచలనాత్మక మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ద్వయం మరో భారీ ప్రాజెక్ట్ ‘చిరుబాబీ2’, ‘చిరు158’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె నారాయణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు భారీ ప్రాజెక్టులను అందించిన తర్వాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు చిత్రం ఇది. ఇప్పటికే వరుస అప్డేట్స్‌తో భారీ అంచనాలు సృష్టించిన ఈ చిత్రం గురువారం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మెగా త్రయం వేదికను పంచుకోవడం అభిమానులకు కనులవిందు చేసింది. పవన్ కళ్యాణ్ క్లాప్‌బోర్డ్ కొట్టగా, సుష్మిత కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వి.వి. వినాయక్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

బి. గోపాల్, కోదండరామి రెడ్డి, నాగబాబు చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లోహిత్ తన బృందంతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాస్ ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకున్న దర్శకుడు బాబీ కొల్లి ఈసారి మరింత భారీ కథను సిద్ధం చేశారు. మాసీవ్ స్కేల్, ఇంటెన్సిటీ తో నిండిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఆయన జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఈ సినిమా కోసం ఆయన ఎంత అంకితభావంతో సిద్ధమవుతున్నారో స్పష్టం చేసింది. ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.