
బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్‌రావు కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పర్యావరణశాఖ ఫార్మాసిటీకే అనుమతిచ్చిందని, డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఫార్మాసిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని గుర్తు చేశారు. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. 75 శాతం ఫార్మాసిటీ.. 25 శాతం మిగతావి ఉండాలని చూశామని, ఈ ప్రభుత్వం 75 శాతం వ్యాపారం, 25 శాతమే ఫార్మా ఉండేలా చేస్తున్నారని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీని రీస్టోర్ చేస్తామని ప్రకటించారు. ఇది తన మాట కాదు అని, పార్లమెంట్ చట్టం అని పేర్కొన్నారు. ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రారంభించామని తెలిపారు. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటికి వెళ్లొద్దని ఫార్మాసిటిని తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచిపోయిందని, చివరి సంవత్సరం ఎన్నికలు ఉంటాయని చెప్పారు. భూములు పంచి పెట్టి బ్యాక్ ఎండ్ ఏదో లబ్ది పొందాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఫార్మా సిటీ అభివృద్ది చెందితే బిఆర్‌ఎస్ పార్టీకి పేరు వస్తుందని ఇలా చేశారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా నడవదు.. కోర్టులో నిలబడదు అని,ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుందని హరీష్ రావు అన్నారు.












