న్యూఢిల్లీ: ఇది పరివర్తన సమయం ప్రతీకార దశ కాదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్ణయాత్మక ఘన విజయం ఖరారు తరువాత సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ బిజెపి ప్రధాన కార్యాలయంలో పార్టీ కా ర్యకర్తలను ఉద్ధేశించి ఉత్సాహంతో, ఉ ద్వేగంతో ప్రసంగించారు. బెంగాల్‌లో ఇ ది బిజెపికి అపూర్వ తొలి విజయం అని, చారిత్రాత్మకం అని, ఇక్కడ బిజెపి గెలుపు తీర్పు నేపథ్యంలో అందరికి శిరస్సు వం చి నమస్కరిస్తున్నానని బిజెపి తరఫున మోడీ చెప్పారు. ఎక్కువగా ఆయన ప్ర సంగం బెంగాల్‌పైనే కేంద్రీకృతం అయిం ది. చిట్టచివరికి బెంగాల్ భయాందోళనల దశ నుంచి విముక్తి పొందింది. ఇది మా ర్పు ఆసన్న సమయం,

ప్రతీకారం దిశకు సాగే పనిలేదని తెలిపారు. బిజెపి కార్యకర్తలు రాజకీయ హింసా సంస్కృతిని వీడాలని, రాష్ట్రం ప్రగతి దిశలో పాటుపడాలని పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బెంగాల్, పుదుచ్చేరి, అసోంలు ఎన్‌డిఎ ఖాతాలోకి చేరిన దశలో మోడీ మాట్లాడారు. ఇటీవలి మహిళా బిల్లును వ్యతిరేకించి అడ్డుకున్నందుకు జనం ఈసారి కాంగ్రెస్, టిఎంసిలను శిక్షించిందని చెప్పారు. ఇక త్వరలోనే సమాజ్‌వాది పార్టీకి కూడా మహిళల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. 2027లో యుపి అసెంబ్లీ ఎన్నికలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.


మోడీ ప్రసంగం దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. బెంగాల్‌ను ఇంతకాలం రాజకీయ కక్షలు కార్ఫణ్యాలు దెబ్బతీస్తూ వచ్చాయి. ప్రగతి కుంటుపడింది. ప్రతి పార్టీ కూడా ఈ పద్థతి వీడాలని తాను పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. మనం ఇప్పటి నుంచే అక్కడి ఈ పాత పద్థతిని మార్చాల్సి ఉందన్నారు. బిజెపి విజయోత్సవ సభకు బిజెపి అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతరులు హాజరయ్యారు. గంగా ప్రవాహ ప్రాంతం అంతా కూడా బిజెపి పాలితం అవుతుందని తాను ఇంతకు ముందు ఇక్కడ జరిగిన ఓ విజయోత్సవ సభలో తెలిపానని ఇప్పుడు ఇది నిజం అయిందని మోడీ గుర్తు చేశారు. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ వరకూ విజయ యాత్ర పరిపూర్ణం అయిందన్నారు. బీహార్ తరువాత ఇప్పుడు బెంగాల్ బిజెపి పాలనలోకి చేరిందంటే అక్కడి ప్రజానీకానికి ఇంతకాలం దూరమైన సుపరిపాలన తిరిగి దక్కినట్లు అవుతుందన్నారు. గెలుపోటములు సహజం అని అయితే ఇప్పుడు జరిగిన ఐదు చోట్ల ఎన్నికల ఫలితాలతో భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదనే విషయం ప్రజలు చాటి చెప్పారని వ్యాఖ్యానించారు.

అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని కితాబు ఇచ్చారు. ఎన్నికలలో మహిళల ప్రాతినిధ్యం ఓటింగ్ దశ నుంచి పోటీ వరకూ గణనీయంగా ఉందని తెలిపారు. ఇక కేరళలో పది సంవత్సరాల ఎల్‌డిఎఫ్ దుష్పరిపాలన ప్రభావంతో దీనికి దూరంగా ఉండేందుకు ప్రజలు కాంగ్రెస్ కూటమిని ఎంచుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లబ్థి పొందిందని అయితే అక్కడి సోదరిలు, తల్లులు వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు బుద్ది చెపుతారని , తప్పుడు పాలనకు చెంపచెళ్లు తథ్యమన్నారు. అసోంలో తిరిగి బిజెపి అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరిలో కూడా కూటమి అధికారం కొనసాగనుంది. ఈ సత్ఫలితాలన్ని కూడా తాము పాటించే పౌరుడే దేవుడు అనే మంత్రంతోనే సాధ్యం అయ్యాయని ప్రధాని స్పష్టం చేశారు. బెంగాల్‌లో విజెపి విజయంతో ఇన్నాళ్లకు జనసంఘ్ వ్యవస్థాపకులు, బెంగాళీ శ్యామ ప్రసాద ముఖ్యర్జీ ఆత్మశాంతి కలుగుతుందని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఓటు ఎవరికి వేసినా ప్రతి ఓటరుకు తాను నమస్కరిస్తానని, ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం అన్నారు.