
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేసి, అమెరికా ఆంక్షలను ఎత్తివేస్తే యుద్ధాన్ని ముగించడంతో పాటు హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి సిద్ధమని ఇరాన్ చేసిన ప్రతిపాదనపై అమెరికా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు.పాకిస్థాన్ ద్వారా అమెరికాకు చేరిన ఈ ప్రతిపాదనపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేశారు. ఏ ఒప్పందమైనా ఇరాన్ అణ్వాయుధాల దిశగా ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లకుండా పూర్తిగా అడ్డుకునేలా ఉండాలి అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ భద్రతా బృందంతో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనిపై ట్రంప్ తరువాత అధికారికంగా స్పందించే అవకాశం ఉందని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచి రష్యా పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌కు దీర్ఘకాలంగా మద్దతు ఇచ్చే రష్యా ప్రస్తుతం ఎలాంటి సహాయం అందిస్తుందన్నది స్పష్టంగా తెలియరాలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ లో కనీసం 3,375 మంది మరణించినట్లు సమాచారం.
అలాగే లెబనాన్ లో ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా మధ్య మళ్లీ ప్రారంభమైన ఘర్షణల్లో 2,521 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఇక ఇజ్రాయెల్ లో 23 మంది, గల్ఫ్ అరబ్ దేశాల్లో మరో డజను మందికి పైగా మరణించారు. లెబనాన్‌లో 16 మంది ఇజ్రాయెల్ సైనికులు, ప్రాంతంలో 13 మంది అమెరికా సైనిక సిబ్బంది, దక్షిణ లెబనాన్‌లో ఆరుగురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల సిబ్బంది మృతి చెందినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. లెబనాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకారం, మంగళవారం దక్షిణ లెబనాన్‌లోని చక్రా, ట్బ్నైన్, కఫ్రా గ్రామాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి. మన్సౌరీ గ్రామంలో ఒక మోటార్‌సైకిల్‌పై డ్రోన్ దాడి జరిగినట్లు కూడా వెల్లడించింది. అయితే ప్రాణనష్టం వివరాలు వెంటనే తెలియరాలేదు. దక్షిణ లెబనాన్‌లోని 16 గ్రామాల ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే ఈ దాడులు జరిగాయి. హెజ్బొల్లా మిలిటెంట్లు ఈ గ్రామాలను ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.










