
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు వెనక్కి తగ్గమని, పోరాడుతూనే ఉంటామని అన్నారు. మంగళవారంనాడిక్కడ నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఎంతో కృషి చేశామని, అయితే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ లాంటి విపక్షాలు నీచ రాజకీయాలు చేసి ఆమోదం పొందకుండా కుట్రలు చేశాయన్నారు. మహిళలు చట్టసభలైన పార్లమెంట్, అసెంబ్లీల్లోకి రావడం వారికి ఇష్టం లేదని,
కొన్ని దశాబ్దాలుగా వాళ్లు చేస్తున్నది కూడా ఇదేనని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ అనే మహా యజ్ఞాన్ని మొదలు పెట్టామని, అది విజయవంతం అయ్యేందుకు మహిళా మూర్తుల ఆశీర్వాదాలు తీసుకునేందుకే తాను వారణాసి వచ్చినట్లు మోడీ పేర్కొన్నారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ కోసం తెచ్చింది కాదని, తాము ఇందులో ఎలాంటి రాజకీయ లబ్ధిని ఆశించలేదన్నారు. పేదలు, సాధారణ కుటుంబాలకు చెందిన మహిళలు చట్టసభల్లోకి రావడం విపక్షాలకు ఇష్టం లేదని మండిపడ్డారు.









