
పంజాబ్ లోని పటియాలలో శంభు ప్రాంతంలో సోమవారం రాత్రి శంభుఅంబాల రైల్వే ట్రాక్ సమీపంలో సంభవించిన పేలుడు వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు ప్రయత్నించిన వ్యక్తి ఆ సంఘటనలోనే ప్రాణాలు కోల్పోగా, పేలుడు ధాటికి ఛిద్రమైన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. బొతోనియా గ్రామానికి సమీపాన గల ఈ శంభుఅంబాల రైల్ ట్రాక్‌ను సరకు రవాణాకు వినియోగిస్తుంటారు. ఈ పేలుడు సంఘటనలో ప్రమేయం ఉందన్న అనుమానంతో నలుగురిని అరెస్టు చేశారు. మృతుడు జాగృప్ సింగ్ తరన్‌తరన్ జిల్లా పంజ్వార్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించినట్టు పటియాలా ఎస్ఎస్పి వరుణ్ శర్మ వెల్లడించారు. పేలుడు ప్రదేశాన్ని సందర్శించిన స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వే) శశిప్రభా ద్వివేది సిసిటివీ ఫుటేజీ ఆధారంగా వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడు జాగృప్ తన మోటార్ సైకిల్‌ను అమృత్‌సర్‌లో పార్కింగ్ చేసినట్టు గుర్తించామన్నారు. అరెస్టయిన వారిలో మన్సా నివాసితులైన ప్రదీప్ సింగ్ ఖల్సా, కుల్విందర్ సింగ్,తరన్ తరన్‌కు చెందిన సత్నాం సింగ్, గురుప్రీత్ సింగ్ ఉన్నారు. మలేసియా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ సానుభూతిపరుల వర్గంతో సంబంధాలు ప్రదీప్ ఖల్సాకు ఉన్నాయని,
సంఘటనకు ఆయనే ప్రధాన సూత్రధారి అని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కులదీప్ చాహల్ వెల్లడించారు. ఉగ్రవాద శిక్షణ కోసం రాడికల్ యువకులను ఆయన మలేసియా పంపేవాడని , ఉగ్రవాద కార్యకలాపాలకు టార్గెట్ నిర్ణయించేవాడని పేర్కొన్నారు. చల్దా వహీర్ చక్రవర్తి .అట్టరియే అన్న పేరుతో ప్రదీప్ రాడికల్ ఆర్గనైజేషన్ నిర్వహించేవాడని తెలిపారు. నిందితుల నుంచి హేండ్ గ్రెనేడ్, రెండు పిస్టళ్లు, పేలుడు పదార్థం , మున్ముందు పేలుళ్లకోసం వినియోగించడానికి సిద్ధం చేసిన పరికరాలను, లాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు సమయంలో ఆ ట్రాక్‌పై గూడ్స్‌ట్రైన్ వెళ్తుండగా ఏదో జరగరానిది జరిగిందని లోకోమోటివ్ పైలట్ పసిగట్టాడని, అధికారులను అప్రమత్తం చేశాడని పోలీస్ అధికారి ద్వివేది వెల్లడించారు. ఈ సంఘటనపై ఎన్ఐఎ దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలిపారు. పేలుడు ప్రదేశంలో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా సైంటిఫిక్ సాక్షాలతో సాంకేతికంగా దర్యాప్తు చేపట్టడమైందని పోలీస్ అధికారి శర్మ చెప్పారు. పేలుడుకు దెబ్బతిన్న ఆ రైల్వేట్రాక్‌ను పునరుద్ధరించడమైందని తెలిపారు.










