అమెరికాలోని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నిర్వహిస్తున్న మెగా కన్వెన్షన్ 2026లో అత్యంత ఆసక్తికరంగా మారనున్న కార్యక్రమం "పొలిటికల్ ఫోరం & మీట్ అండ్ గ్రీట్". జూలై 19, 2026న నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మధ్యాహ్నం 1:00 గంటల నుంచి ఈ ప్రత్యేక రాజకీయ వేదిక ప్రారంభం కానుంది.
ఈ ఫోరంలో "ఆల్ పార్టీ పొలిటికల్ డిబేట్" నిర్వహించనుండగా, తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఒకే వేదికపై పాల్గొనడం విశేషంగా మారింది. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్ రాజకీయ దిశ, ప్రవాస భారతీయుల పాత్ర వంటి పలు సమకాలీన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఈ రాజకీయ వేదికలో ఆర్ & బి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రి దనసరి సీతక్క, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు వంటి ప్రముఖ మంత్రులు పాల్గొననున్నారు.
అలాగే లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, జి. జగదీష్ రెడ్డి, చమకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డితో పాటు ప్రముఖ బీజేపీ నాయకురాలు మాధవి లత కొంపెల్ల కూడా ఈ వేదికను అలంకరించనున్నారు.
వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై అభిప్రాయాలు పంచుకోనున్న ఈ కార్యక్రమం అమెరికాలోని తెలుగు ప్రవాసులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజకీయ నాయకులతో ప్రత్యక్షంగా కలుసుకునే "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమం కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక పొలిటికల్ ఫోరంకు డా. వాణి గడ్డం చైర్‌గా వ్యవహరిస్తుండగా, సందీప్ కటూరి, శ్రీని జక్కిరెడ్డి, రామరాజు కంచా, అరవింద్ మోదిని, స్వర్ణ ప్రకాష్ తోట, అనుదీప్ ధిడ్డి, క్రాంతి కతెరశాల సహా పలువురు కో-చైర్లు సమన్వయం చేస్తున్నారు.
ప్రవాస తెలంగాణవాసులు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అరుదైన చర్చా వేదికను విజయవంతం చేయాలని టీటీఏ నిర్వాహకులు పిలుపునిచ్చారు.















