తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్‌లో బోనాల పండుగ వేడుకలు ఆదివారం (ఆగస్టు 9, 2026) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. సుంగే కేడుట్‌లోని శ్రీ అరసకేసరి శివాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 850 నుంచి 900 మంది భక్తులు పాల్గొని బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

బోనాల ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, పులివేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి భక్తి గీతాలకు చిన్నా, పెద్దా తేడా లేకుండా భక్తులు ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. సింగపూర్‌లోని తెలుగు సమాజం సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపై ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉన్న బోనాల పండుగను సింగపూర్‌లో తెలుగు వారందరూ కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందని వేడుకల్లో పాల్గొన్న భక్తులు తెలిపారు. విదేశాల్లోనూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

జాతరలో పోతురాజు, పులివేషాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి, అరవింద్లకు సొసైటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ ఏడాది బోనం సమర్పించిన కుటుంబాల్లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి, అన్ను సుజాత తదితరులు ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ తరఫున రిటర్న్ గిఫ్ట్‌లు అందజేశారు. భక్తులు తమ ఇళ్లలో తయారు చేసి తీసుకొచ్చిన అన్న ప్రసాదాన్ని పంచుకున్నారు. గడప రమేశ్, బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా తయారు చేసి తీసుకువచ్చారు.

వేడుకలకు హాజరైన భక్తుల కోసం కమిటీ ఆధ్వర్యంలో పులిహోర, పెరుగు అన్నం, కేసరితో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

బోనాల జాతరను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ TCSS అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డితో పాటు ఉపాధ్యక్షులు, సంస్థాగత, ప్రాంతీయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్‌లోని తెలంగాణ వాసులు, తెలుగు సమాజం, స్పాన్సర్లు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సొసైటీ చేసిన ఏర్పాట్లను పాల్గొన్న వారు అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లు, దేవాలయ యాజమాన్యం, ఫొటోగ్రఫీ కవరేజ్ అందించిన కృష్ణ నెల్లుట్ల, సౌండ్ సాంకేతిక సహకారం అందించిన యసరావేణి విజయ కుమార్ మెరుగుతో పాటు వేడుక విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా సింగపూర్‌లోని తెలుగు సమాజం మరోసారి తమ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పింది.