పద్మశ్రీ పురస్కార గ్రహీత, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ ఘన సన్మానం నిర్వహించింది. ఆదివారం, ఆగస్టు 9న పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్‌లో ఉన్న బైయర్స్ స్టేషన్ క్లబ్ హౌస్‌లో ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం వైభవంగా జరిగింది.

భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌ను గౌరవించేందుకు రవి పొట్లూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, కమ్యూనిటీ ప్రతినిధులు, అభిమానులు హాజరయ్యారు.

దాదాపు 49 ఏళ్ల సినీ ప్రస్థానంలో తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజేంద్ర ప్రసాద్ సేవలను, సినీ ప్రయాణాన్ని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. హాస్యరస పాత్రలతో పాటు విభిన్నమైన ఉత్తమ పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆయనకు పద్మశ్రీ రావడం తెలుగుజాతికే గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కు రూ.8 లక్షల విరాళాన్ని అందించారు. ఆయనకు తమ పూర్తి మద్దతు, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఫిలడెల్ఫియా తెలుగు కమ్యూనిటీ హామీ ఇచ్చింది.

కార్యక్రమంలో కమ్యూనిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్‌తో తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. పూలమాలలు, జ్ఞాపికలతో ఆయనను ఘనంగా సన్మానించారు.

ప్రవాస తెలుగు ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలపై రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యారు. సముద్రాలు దాటి వచ్చినా ప్రవాసాంధ్రులు తనపై చూపిస్తున్న ఆప్యాయత చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్న అనుభూతి కలుగుతోందని అన్నారు. తనను ఇన్నేళ్లుగా నటుడిగా ముందుకు నడిపిస్తున్నది ప్రేక్షకుల ప్రేమేనని పేర్కొన్నారు.

పద్మశ్రీ పురస్కారం తనకు మాత్రమే దక్కిన గౌరవం కాదని, తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ చెందుతుందని రాజేంద్ర ప్రసాద్ వినయంగా తెలిపారు. 49 ఏళ్ల నటనా ప్రయాణంలో ప్రేక్షకులకు నవ్వులు పంచి, వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడం కంటే గొప్ప అవార్డు మరొకటి లేదని అన్నారు.

శ్వేత కొమ్మోజి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జగదీప్ రెడ్డి ఆనుముల, పరమేశ్ భీమ్ రెడ్డి, వేణు సంగాని, సతీష్ తుమ్మల, రామకృష్ణ తాడిశెట్టి, గిరిధర్ మసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, ఫణి కంతేటి, రాజు కక్కెర, సురేష్ వెంకన్నగారి, సునీల్ కోగంటి, వెంకట్ సింగు తదితరులు పాల్గొన్నారు.